TRS will finalize munugode candidate today: మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని తెరాస ఖరారు చేసింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఇవాళ ప్రకటించనున్నారు. ప్రభాకర్ రెడ్డికి నేడే బీ-ఫారం ఇచ్చే అవకాశం ఉంది. మంచి రోజు నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలని కూసుకుంట్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దసరా పురస్కరించుకొని జాతీయ పార్టీ ప్రకటన ప్రక్రియ పూర్తి కాగానే తెరాస యంత్రాగం మునుగోడుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనుంది. మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఎమ్మెల్యే ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించనున్నారు. కేటీఆర్, హరీశ్ రావు సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ బాధ్యతలు కేటాయించారు. రేపట్నుంచి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నారు.
మునుగోడులో భారీ బహిరంగ సభకు కసరత్తు.. మునుగోడులో ఇప్పటికే భారీ బహిరంగ సభ నిర్వహించిన సీఎం కేసీఆర్... త్వరలో చండూరులోనూ మరో భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించారు. ప్రచారం ముగిసే సమయానికి ఒకటి, రెండ్రోజుల ముందు సభ నిర్వహించాలని భావిస్తున్నారు. సీపీఐ, సీపీఎంలతో సమన్వయం చేసుకుంటూ వామపక్షాల ఓట్లన్నీ కచ్చితంగా తెరాసకు పడేలా వ్యూహాలు రచిస్తున్నారు. మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి మునుగోడు పరిస్థితిని సమీక్షించారు. నామినేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. భాజపా, కాంగ్రెస్ ఎత్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ప్రతీ ఓటరును కలిసేలా జాగ్రత్త వహించాలని సీఎం సూచించారని తెలుస్తోంది.
ఇవీ చదవండి: