TRS Campaign in UP: జాతీయ స్థాయి రాజకీయ కూటమి దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది. కూటమి ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలని భావిస్తోంది. భాజపాకు వ్యతిరేకంగా... సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించాలని యోచిస్తోంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఓసీ నేతలతో కూడిన బృందం యూపీ వెళ్లాలని భావిస్తోంది. అవసరమైతే సీఎం కేసీఆర్ కూడా ఒక సభలో పాల్గొనాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అఖిలేష్ యాదవ్‌తో చర్చించి..
ప్రచారాస్త్రాల కోసం భాజపా వ్యతిరేక అంశాలపై అధ్యయనం చేస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌తో చర్చించి.. త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. యూపీలో సమాజ్‌వాదీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని.. అక్కడి నేతలతో సంప్రదింపుల అనంతరం ప్రచారంపై నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ ఇటీవలే ట్విట్టర్లో కూడా వెల్లడించారు. ఇతర రాష్ట్రాల ప్రచారంలో గతంలోనూ తెరాస పాల్గొంది. ఝార్ఖండ్‌లో 2009 ఎన్నికల్లో శిబుసోరెన్‌కు మద్దతుగా తెరాస బృందం ప్రచారం నిర్వహించింది. కర్ణాటకలో 2018లో కేసీఆర్ ప్రచారానికి వెళ్లాలని భావించినప్పటికీ.. వీలు కాకపోవడంతో తెలుగు ప్రజలంతా జేడీఎస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు.
భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు..
భాజపా వ్యతిరేక పార్టీలను ఏకతాటికిపైకి తెచ్చే ప్రక్రియలో తెరాస అధినేత కేసీఆర్ తలమునకలయ్యారు. గత నెలలో తమిళనాడు వెళ్లిన కేసీఆర్... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో చర్చలు జరిపారు. ఇటీవల ప్రగతిభవన్‌లో సీపీఐ నేతలు డి.రాజా, కేరళ మంత్రి రాజన్.. సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, కేరళ సీఎం విజయన్, త్రిపూర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌తో ప్రగతిభవన్‌లో కేసీఆర్ భేటీ అయ్యారు. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో ఫోన్లో మాట్లాడారు. కూటమి ఏర్పాటులో తెరాసకు తోడుగా ఓ రాజకీయ వ్యూహకర్త కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనే కూటమికి ప్రయత్నాలు మొదలు పెట్టిన కేసీఆర్... అప్పడు కర్ణాటక జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామి, తమిళనాడులో స్టాలిన్, ఒడిశాలో బిజూ పట్నాయక్, ఝార్ఖండ్‌లో శిబుసోరెన్, యూపీలో అఖిలేష్ యాదవ్, ఏపీలో వైకాపా అధినేత జగన్, బంగాల్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతోనూ చర్చించారు.
త్వరలోనే సమావేశం..
భాజపా ముక్త్ భారత్ నినాదంతో.. కేంద్రంలో భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా ప్రజాస్వామిక, లౌకిక కూటమి ఏర్పాటుకు కసరత్తు జరుపుతోంది. భాజపా వ్యతిరేక, భావసారూప్య పార్టీలన్నీ కలిసి.. త్వరలో హైదరాబాద్ లేదా ఉత్తరప్రదేశ్‌లో సమావేశం కావాలని భావిస్తున్నాయి. మరోవైపు దిల్లీలో తెరాస కార్యాలయం నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి: