CM KCR Meeting With MPs : ఈరోజు మధ్యాహ్నం తెరాస ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల దృష్ట్యా.. ఒంటిగంటకు ప్రగతిభవన్‌లో ఎంపీలతో సీఎం భేటీ కానున్నారు. ఉభయసభల్లో తెరాస నేతలు అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేసేందుకు.. ఆ పార్టీ పార్లమెంట్ (రాజ్యసభ, లోక్ సభ) సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు.
లోక్సభ, రాజ్యసభల్లో తెరాస ఎంపీలు అవలంభించాల్సిన పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు సూచించనున్నారు. తెలంగాణపై వివక్షను ఎత్తిచూపేలా.. పార్లమెంటు వేదికగా కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని.. ధాన్యం కొనుగోళ్లపైనా పోరాడాలని ఎంపీలకు మార్గనిర్దేశం చేయనున్నారు.
CM KCR fight against Center : పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. కేంద్రంపై పోరాటానికి కలసి రావాలని వివిధ రాష్ట్రాల సీఎంలు, నేతలతో ఇప్పటికే సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్, తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్‌లతో పలు అంశాలపై చర్చించారు. పార్లమెంటు వేదికగా కేంద్రప్రభుత్వంపై పోరాడదామని సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకు నేతలు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎంపీలతో కానున్న సీఎం కేసీఆర్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.