ధాన్యం కొనుగోళ్లపై తెరాస సభ్యులు వరుసగా మూడోరోజు బుధవారం కూడా ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగించారు. ‘రైతులను శిక్షించొద్దు. కనీస మద్దతు ధర చట్టం తేవాలంటూ’ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఉదయం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయం మొదలైనప్పట్నుంచి తెరాస సభ్యులు రైతులను ఆదుకోవాలనే డిమాండ్లతో కూడిన ప్లకార్డులు పట్టుకుని వెల్‌లో బైఠాయించి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. సాయంత్రం సభ వాయిదా పడేవరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. వారి ఆందోళనల మధ్యే కొద్దిసేపు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. రాజ్యసభలోనూ తెరాస సభ్యులు ఆందోళన చేశారు. సభల ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కూడా సభ్యులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో తెరాస సభ్యులపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యను ప్రస్తావించడానికి తగిన సమయం ఇవ్వడానికి సిద్ధమని చెప్పినా ఆందోళన చేయడం మంచిదికాదని హితవు పలికారు. ‘‘సభలో సీనియర్ సభ్యులు మాట్లాడుతుండగా వారి ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. సమస్యపై మాట్లాడటానికి మంగళవారమే మీ పార్టీ నేతకు పూర్తిస్థాయి సమయం ఇచ్చాను. అయినప్పటికీ మీరు నినాదాలు చేయడానికి, ప్లకార్డులు ప్రదర్శించడానికి ఈ రోజు ఇక్కడికొచ్చారు. సభలో మీతీరు బాగాలేదు. కొందరు సభ్యులు పూర్తిసభను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. సభ గౌరవ మర్యాదలు, సహకారంతో నడుస్తుంది. ఇలాంటి నిబంధనలకు విరుద్ధమైన విధానాలు, సంప్రదాయాలను అడ్డుకోవడానికి సభ్యులంతా సామూహికంగా ప్రయత్నించాలని కోరుతున్నానని’ స్పీకర్ అన్నారు. సభానాయకుడు తమ సభ్యులకు నచ్చజెప్పుకోవాలని సూచించారు.
రాజ్యసభ ఛైర్మన్ మండిపాటు
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. 12 మంది సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు, రైతు సమస్యలపై తెరాస సభ్యులు ప్లకార్డులతో వెల్‌లో నిరసన తెలపడంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ‘‘ఎంత చెప్పినా సభ్యుల్లో పశ్చాత్తాపం లేకపోవడం పార్లమెంటరీ వ్యవస్థను అవమానించడమే. వెల్‌లోకి రావడం, బల్లలపైకి ఎక్కడం, కాగితాలు విసిరేయడం, మంత్రుల చేతుల్లోని కాగితాలు లాక్కోవడం, సభాధ్యక్షుడిని సవాల్ చేయడం వంటి చర్యలు పార్లమెంటు, ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకం. ప్లకార్డులు సభలోకి తీసుకురాకూడదు. అయినా తెస్తున్నారు. సభలో నిబంధనలకు వ్యతిరేకమైన ప్రవర్తనను చూడదలచుకోలేదు’’ అన్నారు. ఉభయ సభలు వాయిదాపడిన తర్వాత తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేకే, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావులు.. ఇతర ఎంపీలతో కలిసి తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కిషన్‌రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారు
ప్రతిగింజా కొంటామనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నాం. అదే సమయంలో వానాకాలం పంట అంటూ కిషన్‌రెడ్డి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వానాకాలంతోపాటు యాసంగి పంట కూడా కొనాలి. వచ్చే ఏడాది కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలి. యాసంగి ధాన్యం సేకరణ అంశాన్ని కేరళ, తమిళనాడు, ఒడిశా ఎంపీలతో కలిసి గురువారం ఉభయ సభల్లో లేవనెత్తుతాం. - కె.కేశవరావు, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత
ఒక్కో మంత్రిది ఒక్కో మాటా?
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రతిగింజా కొంటామని చెబుతున్నారు. అదే అంశంపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం హామీ ఇవ్వాలి. ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి.. తలోమాట చెబుతున్నారు. పీయూష్ గోయల్ యాసంగి పంట కొనమని చెప్పిన తర్వాత సీఎం కేసీఆర్ అదే అంశాన్ని రైతులకు చెప్పారు. ఇప్పుడు ప్రతి గింజా కొంటామని కిషన్‌రెడ్డి హామీ ఇస్తుండడం, భాజపా నాయకులు కల్లాల వద్దకు వెళ్లి పంట కొనుగోలు చేస్తామని చెబుతుండడంతో గందరగోళం నెలకొంటోంది. ఈ అంశంపై భాజపా నాయకులు బయటచెప్పే మాటలనే పార్లమెంట్‌లో చెప్పిస్తే బాగుంటుంది. గతేడాది తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని కేంద్రం పార్లమెంట్‌లో చెప్పింది. ఈ ఏడాది 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం కోటి మెట్రిక్ టన్నులు కొనాలని విజ్ఞప్తిచేస్తే ‘మీ దగ్గర ఇంత ఎలా పండుతుందని’ పీయూష్ గోయల్ అవమానిస్తున్నారు. పంట ఎక్కువగా పండిస్తే ఆనందించాల్సిందిపోయి ఎదురు ప్రశ్నించడం సరికాదు. -నామా నాగేశ్వరరావు, లోక్‌సభ పక్ష నేత
ఇదీ చదవండి: