తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతోమందిని కేసీఆర్ నాయకులుగా తయారు చేశారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున్న సాగిన సమయంలో ఎంతోమంది తెరాసలో చేరారని తెలిపారు. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందని పునరుద్ఘాటించారు. ఎంతోమంది తెరాసలో చేరారు.. వెళ్లిపోయారని చెప్పారు. బయటకు వెళ్తూ కేసీఆర్‌పై విమర్శలు చేశారని.. ఈటల కూడా అదే పాటించారని అన్నారు. ఈటల రాజేందర్‌ను పార్టీ ఎంతో గౌరవించిందని వెల్లడించారు.
ఈటలకు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభాపక్ష నేతగా అవకాశం ఇచ్చారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండుసార్లు మంత్రిగా అవకాశం ఇచ్చారు. ప్రగతిభవన్‌లోకి రానివ్వలేదని ఈటల చెబుతున్నారు. ప్రగతిభవన్‌లోకి రానివ్వకుంటే అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు? బడుగు బలహీనవర్గాలపై నిజంగా ప్రేమ ఉంటే వారి భూములు ఎందుకు ఆక్రమించారు. ఆత్మగౌరవం కోసం కాదు.. ఆస్తుల రక్షణ కోసమే ఈటల ప్రయత్నాలు. తెరాస, కేసీఆర్‌పై అనవసరంగా నోరు పారేసుకోవద్దు. ఈటల వెనుక కేవలం కొంతమంది అసంతృప్తివాదులే ఉన్నారు. 19 ఏళ్లలో తెరాస అనేక విజయాలు, ఓటములను చవిచూసింది.
- పల్లా రాజేశ్వర్ రెడ్డి
సీఎం తెచ్చిన సంక్షేమ పథకాలపై అసంతృప్తి ఉంటే మంత్రివర్గంలో చెప్పొచ్చు కదా అని ఈటలను పల్లా ప్రశ్నించారు. రైతుబంధుపై కూడా ఆరోపణలు చేశారని.. ఆ పథకంతో రాష్ట్రంలో ఎక్కువమంది చిన్న, సన్నకారు రైతులకే లబ్ధి చేకూరిందని స్పష్టం చేశారు. 25 ఎకరాల కంటే ఎక్కువ భూములు ఉన్న రైతులు కేవలం 6 వేలమందే ఉన్నారని చెప్పారు. ధాన్యం సేకరణ తప్పనిసరిగా ప్రభుత్వం చేయాల్సిన పనికాదని అన్నారు.