Ministers on Hanumakonda BJP Meeting ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో భాజపా నేతల విమర్శలను మంత్రులు తిప్పికొట్టారు. కండ్లుండి చూడలేని.. వారికి అభివృద్ధి కనిపించదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నోరు తెరిస్తే అబద్దాలు చెప్పే వారికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రయోజనాలు అర్థం కావని ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓరుగల్లులో నిర్మాణంలో ఉన్నది ఆసుపత్రి మాత్రమే కాదన్న హరీశ్...ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశంలో నిర్మిస్తున్న ఒకే ఒక అధునాతన హెల్త్ సిటీ అని చెప్పారు. తెలంగాణకు ఏం ఇచ్చారని జేపీ నడ్డా విమర్శిస్తున్నారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల మంజూరు చేయకుండా... సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
బండి సంజయ్ పాదయాత్రలో ప్రజల భాగస్వామ్యం లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజల్ని రెచ్చగొట్టడం, రాష్ట్రంలో అశాంతి నెలకొల్పడం.. మతాల మధ్య చిచ్చుపెట్టడమే లక్ష్యంగా యాత్ర సాగిందని విమర్శించారు. ముగింపు సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనని ఎర్రబెల్లి అన్నారు.
ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు చేశారో బండి సంజయ్‌కే తెలియాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. యాత్ర వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్‌లో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయం, వైద్య కళాశాల, తెరాస కార్యాలయాలను పరిశీలించారు. రాజకీయ లబ్ధి కోసమే తెరాసపై ఆరోపణలు చేస్తున్నారని సత్యవతి వ్యాఖ్యానించారు. భాజపా ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణలో అధికారంలోకి రాలేరని మంత్రులు వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: