రాష్ట్ర రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం ద్వంద్వ వైఖరి పాటిస్తోందని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు. కేంద్రం.. రాష్ట్రానికి, ప్రాంతానికి ఒక నీతి పాటిస్తోందని ఆరోపించారు. పంజాబ్‌లో వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తున్నారని... తెలంగాణ ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తోందని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి సమాధానం లేదని అన్నారు. తెరాస శాసనసభాపక్ష సమావేశం అనంతరం... తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
'ఈనెల 18న ఇందిరాపార్క్‌లో తెరాస మహాధర్నా చేస్తాం. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు మహాధర్నా నిర్వహిస్తాం. మహాధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు. మహాధర్నా తర్వాత గవర్నర్‌కు వినతిపత్రం అందిస్తాం. ఈనెల 18 తర్వాత రెండ్రోజుల్లో కేంద్రం ప్రకటన చేయాలి. పార్లమెంటులోనూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం.'
- కేసీఆర్, సీఎం
కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం లేదు
ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తామంటే.. కేంద్రం నిరాకరిస్తోందని సీఎం కేసీఆర్ (CM KCR) ఆరోపించారు. కొనుగోలు విషయం నిర్ధరణ కోసం తానే స్వయంగా దిల్లీకి వెళ్లినట్లు వెల్లడించారు. ఏడాదికి రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర వినతిపై పరిశీలిస్తామని కేంద్రమంత్రి చెప్పారని... ఐదారు రోజుల్లో జీవోఎంలో చర్చించి తెలుపుతామన్నారని చెప్పారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం లేదని విమర్శించారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏంటని అడిగామని చెప్పారు.
కేవలం ఎఫ్‌సీఐకి మాత్రమే
ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులెత్తేసిందని సీఎం (CM KCR) అన్నారు. రైతు ప్రయోజనాలు కాపాడే ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. ధాన్యం పంట మార్పిడి చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్రం కొనుగోలు చేసే పరిస్థితి లేదని స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. వరి ధాన్యం కొంటే ప్రాసెస్ జరిగి బయటకు వెళ్లాలన్నారు. బియ్యం నిల్వ చేసుకునే పరిస్థితులు ఉండాలని... దేశంలో నిల్వచేసే పరిస్థితి కేవలం ఎఫ్‌సీఐకి మాత్రమే ఉందని చెప్పారు. ఏ ఒక్క రాష్ట్రానికీ ధాన్యం నిల్వ చేసే పరిస్థితి లేదని తెలిపారు. కేంద్రం 20 లక్షల టన్నుల ధాన్యం తీసుకుంటామని చెప్పిందని వెల్లడించారు. ధాన్యం కొనుగోలుపై మిల్లర్లు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
రైతులపై దాడులా?
62 లక్షల ఎకరాల్లో పంట ఉందని చెప్పినా ఎటూ తేల్చలేదని ముఖ్యమంత్రి అన్నారు. వర్షాకాలంలో పంట తీసుకుంటారా? లేదా? చెప్పట్లేదని తెలిపారు. ఇతర పంటలు వేయాలని వ్యవసాయశాఖ మంత్రి రైతులను కోరారని పేర్కొన్నారు. వర్షాకాలం పంట కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. యాసంగిలో వరి ధాన్యం వేయవద్దని పునరుద్ఘాటించారు. 6,600కు పైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. రాష్ట్రం కొనుగోళ్లు చేస్తుంటే డ్రామాలు మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే రాళ్లతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులపై దాడులు చేస్తారు.. ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటారని సీఎం విమర్శించారు.
ఇదీ చదవండి : భాజపా నేతలపై దాడితో తెరాసకు సంబంధం లేదు