TRS leaders supports KCR's National Party : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని తెరాస పార్టీ 33 జిల్లాల అధ్యక్షులు కోరారు. నరేంద్రమోదీ అస్తవ్యస్త పాలనతో విసిగి వేసారుతున్న దేశ ప్రజలు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ విపక్షంగా విఫలమైన ఈ తరుణంలో కేసీఆరే నిజమైన ప్రత్యామ్నాయంగా యావత్ దేశం గుర్తించిందని తెలిపారు. భాజపా ముక్తభారత్ కోసం కేసీఆర్ వెంటనే జాతీయ పార్టీని స్థాపించాలన్నారు. అన్ని రాష్ట్రాల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని, తామంతా ఆయన వెంటే నడుస్తామని తెలిపారు. తెలంగాణ ప్రగతి నమూనా దేశమంతటికీ విస్తరించాలని, బంగారు భారత్‌గా మారాలన్నారు.
TRS supports KCR's national party : శుక్రవారం తెలంగాణభవన్‌లో 33 జిల్లాల తెరాస అధ్యక్షులు సమావేశమయ్యారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని వారంతా ముక్తకంఠంతో కోరారు. ఈ సందర్భంగా బాల్కసుమన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, మాలోత్ కవిత, లింగయ్య యాదవ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, వినయ్‌భాస్కర్, చింతా ప్రభాకర్, గువ్వల బాలరాజు, మెతుకు ఆనంద్, సంపత్‌రెడ్డి, తాత మధు, తోట ఆగయ్య, రామకృష్ణారావు, శంభీపూర్‌రాజు, అరూరి రమేశ్, ముజీబ్ తదితరులు విలేకరులతో మాట్లాడారు.
అన్ని రాష్ట్రాలకు తెలంగాణ పథకాలు.. ‘దేశంలో మోదీ దుర్మార్గ పాలన నడుస్తోంది. ఈ రాక్షస పాలనను అంతం చేయడం కేసీఆర్‌తోనే సాధ్యం. ఎంతో దూరదృష్టి కలిగిన ఆయన దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీరు, సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి తెలంగాణ పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలు కావాలి. పారిశ్రామిక పెట్టుబడులు రావాలి. రైతు రాజు కావాలంటే కేసీఆర్ నాయకత్వమే దేశానికి శరణ్యం.’
మేధావులు సంప్రదిస్తున్నారు.. ‘జాతీయ పార్టీ పెడితే కేసీఆర్ ఘనవిజయం సాధిస్తారు. ఈ దిశగా మేధావులు, ఆర్థిక నిపుణులు, రైతు నేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇలా అందరూ ఆయనను సంప్రదిస్తున్నారు. జాతీయ పార్టీ స్థాపన కోసం తెరాస జిల్లా అధ్యక్షులుగా మేం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఏ లక్ష్యాలను నిర్దేశించినా నెరవేరుస్తాం’ అని తెలిపారు.
కేసీఆర్ రావడం చారిత్రక అవసరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరమని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్గొండలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాల వైపు చూస్తోందన్నారు. అభివృద్ధిలో వెనకబడుతున్న దేశాన్ని కేసీఆర్ మాత్రమే ముందుకు తీసుకెళ్లగలరని అన్నారు.
ఆయన పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారు.. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ‘స్వచ్ఛ గురుకుల్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గురుకులానికి వచ్చిన మంత్రి మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల ప్రజలు వ్యవసాయానికి ఉచిత నిరంతర విద్యుత్తు, రైతు బీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, పల్లెప్రగతి తరహా పథకాలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర గవర్నర్ రాజకీయ నాయకురాలిగా వ్యవహరించడం బాధాకరమన్నారు.
అయిదేళ్లు ప్రధానిగా ఉంటే దేశం రూపురేఖలు మారతాయి.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందని, అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్‌లో ప్రముఖ రచయిత కాళోజీ జయంతి కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ అయిదేళ్లు ప్రధానమంత్రిగా ఉంటే దేశం రూపురేఖలు మారిపోతాయని మంత్రి అన్నారు. రాజ్‌భవన్‌ను గవర్నర్ భాజపా కార్యాలయంగా మార్చేస్తున్నారని విమర్శించారు.