ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు(trs mlc candidates)పై తెరాసలో ఉత్కంఠ కొనసాగుతోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఆచితూచి అడుగులు వేస్తున్న అధికార పార్టీ.... చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(trs mlc elections 2021)కు ఇవాళ్టితో నామినేషన్లు(trs mlc nomination) గడువు ముగియనుంది. తెరాసకు సంపూర్ణ బలం ఉన్నందున ఆరు స్థానాలు గెలవడం లాంఛనమే. సునాయసంగా శాసనమండలిలో అడుగుపెట్టే అవకాశం ఉండటంతో తాజా మాజీలతోపాటు చాలా మంది నేతలు ఆశిస్తున్నారు.
సిద్ధం కావాలని సోమవారమే ఆదేశాలు..
కేసీఆర్, కేటీఆర్ గతంలో ఇచ్చిన హామీలతోపాటు... సామాజిక, రాజకీయ సమీకరణలు పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేశారు. సోమవారమే అభ్యర్థులకు ఫోన్ చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించి... అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఒక్కో అభ్యర్థిని పది మంది ఎమ్మెల్యేలు బలపరచాల్సి ఉంటుంది. ఇవాళ శాసనసభపక్షం సమావేశం కూడా ఉన్నందున ఎమ్మెల్యేందరూ నగరంలో అందుబాటులో ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, తక్కళ్లపల్లి రవీందర్ రావు, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆకుల లలిత, మధుసూదనచారి, కోటిరెడ్డి పేర్లు కూడా తుది పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీకూ భారీగా పోటీ..
స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ.. డిసెంబర్ 10న పోలింగ్.. డిసెంబరు 14న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. అన్ని స్థానాల్లో తెరాసనే గెలిచే అవకాశం ఉన్నందున... వీటికి కూడా పోటీ భారీగానే ఉంది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి.. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి అవకాశం..
పురాణం సతీశ్‌కుమార్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, భూపాల్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బాలసాని లక్ష్మీనారాయణ, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణ్‌రావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది. పదవీ కాలం పూర్తి కానున్న నేతలతోపాటు.. పలువురు నేతలు అవకాశం ఇవ్వాలని కేసీఆర్, కేటీఆర్‌ను కోరుతున్నారు. ఐఏఎస్‌కు రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డిని స్థానిక సంస్థల కోటాలో పోటీకి దించుతారని ప్రచారం జరుగుతోంది.
ఇదీ చూడండి: