చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో సుమారు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. ఈదురుగాలులకు టమోటా పంట దెబ్బతింది. పలమనేరు మండలం జగమర్లలో పెనుగాలుల దాాటికి 86 ఎకరాల్లో మామిడి పంట నేలరాలింది. పీలేరు, పులిచెర్ల, సదుం, సోమల, బంగారుపాళ్యం, పలమనేరు, చౌడేపల్లె, పూతలపట్టు, తదితర మండలాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. పీలేరు మండలం తలపుల పంచాయతీ రెడ్డివారిపల్లెలో పిడుగుపాటుకు రైతు వెంకట రమణ(65) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణంతో పాటు చింతకుంట, వేములకోట, నికరంపల్లి, పెద్దనాగులవరం, జమనపల్లి తదితర గ్రామాల్లో పెద్ద పెద్ద గులకరాళ్ల మాదిరి వడగళ్లు పడటంతో ఇళ్లపై కప్పులు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. సరఫరా నిలిచిపోయింది. గిద్దలూరు, కంభం, బేస్తవారిపేట, యర్రగొండపాలెం, పుల్లలచెరువు ప్రాంతాల్లో గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది.
తూర్పుగోదావరిలోని దేవీపట్నంలో గంటకు పైగా వడగళ్ల వాన పడింది. ఈదురు గాలులకు మామిడికాయలు నేలరాలాయి. కొన్ని చెట్లు నేలకూలాయి. దండంగిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పోశమ్మగండి, నాగలపల్లి పరిసర ప్రాంతాల్లో కొండవాగులు పొంగాయి. విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దండంగి వద్ద సీతపల్లి వాగు పొంగింది.