విశాఖ మహానగరానికి వెళ్లగానే.. అద్దాల మేడలు దర్శనమిస్తాయి. ఒకరి గురించి ఒకరు పట్టించుకోనంత బిజీ. అయితే ఇదే మహానగరం మధ్యలో ఓ గిరిజన గ్రామం ఉంది. అలా అని సిటీలో కాదండి.. అడవిలోనే.. అక్కడ ఓ ఊరు ఉన్నట్లు ఎవరికీ తెలియదు. అసలు అడవిలో ఊరు ఎలా ఉంది?
విస్తరిస్తున్న నగరీకరణ గ్రామీణ వాతావరణాన్ని కనుమరుగు చేస్తోంది. ఆధునిక జీవనం వైపుగా వేస్తున్న అడుగులు పచ్చని ప్రకృతి అందాలను దూరం చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. కానీ, విశాఖపట్నం లాంటి మహానగరంలో దీనికి భిన్నమైన ఓ అరుదైన ఉదాహరణ కనిపిస్తోంది. పదుల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సాగర నగరిలో ఓ అటవీ ప్రాంతం.. అందులోనూ ఓ కుగ్రామం ఉందంటే నమ్మగలరా? కానీ నమ్మాలి. ప్రకృతి పలకరింపు మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే శంభువానిపాలెం ప్రజలు నిత్యం సవాళ్ల మధ్య తరతరాలుగా ఇక్కడ జీవిస్తున్నారు. 'నగరంలోని అరుదైన గిరిజన పల్లె' ఇది.
పర్మిషన్ తప్పనిసరి..
మహా విశాఖ నగర పాలక సంస్థ 6వ వార్డు పరిధిలో శంభువానిపాలెం గిరిజన గ్రామం ఉంది. కంబాలకొండ అభయారణ్యం మధ్య పచ్చదనం మధ్య ఇమిడిపోయినట్లు ఉండే గ్రామానికి వెళ్లాలి అంటే అటవీశాఖ చెక్ పోస్టు దాటుకుని ముందుకు సాగాలి. అయితే అనుమతి మాత్రం తప్పనిసరి తీసుకోవాల్సిందే. అటవీ శాఖ చెక్ పోస్టును దాటుకుని ముందుకు సాగుతూ ఉంటే కనిపించే దృశ్య మనోహరాన్ని చూడడానికి రెండు కళ్లూ సరిపోవనే చెప్పాలి.
సెల్ఫోన్ సిగ్నల్ ఉండదు..
ఈ గ్రామానికి చేరుకునే మార్గంలో తారసపడే దృశ్యాలు అక్కడి ప్రజలు ఎదుర్కొనే కొన్ని ఇబ్బందులకు అద్దం పడతాయి. ప్రకృతి ఒడిలో జీవిస్తున్నామనే సంతృప్తి ఓ వైపు వారికి వరంగా అనిపించినా.. మరోవైపు రోజువారీ జీవితంలో భాగంగా అనుభవించే కొన్ని ఇబ్బందులు కష్టాన్ని కలిగిస్తుంటాయి. ఈ గ్రామంలో సెల్ఫోన్ సిగ్నల్ ఉండదు. ఏదైనా అత్యవసరమై ఫోన్ చేయాలంటే గ్రామంలోని ఎత్తైన ప్రదేశానికి చేరుకోవాల్సిందే. సిగ్నల్ అందని కారణంగా గ్రామానికి రావాల్సిన రేషన్ వాహనం మార్గం మధ్యనే ఆగిపోయింది. శంభవానిపాలెం గ్రామానికి ప్రజారవాణా కల్పించే బస్సు సదుపాయం కూడా లేదంటే ఇక్కడి ప్రజల అవస్థలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఏ వయసు వారైనా సొంత వాహనం లేకుంటే నడకబాట పట్టక తప్పదు.
నగరంలో పారిశుద్ధ్యం సమస్య దుర్భరంగా ఉంటుంది. మురుగునీటి పారుదల వ్యవస్థపై దృష్టి సారించాల్సి ఉంది. స్వచ్ఛ నగరిగా ప్రత్యేకత కనబరుస్తున్న విశాఖ నగరంలోని ఈ గిరి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా జీవీఎంసీ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పథకాలు దక్కట్లేదు
గిరి ప్రజలు అయినా వీరికి కుల ధృవీకరణ విషయంలో మాత్రం అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. చదువు విషయంలోనూ విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నత చదువు కోసం వెళ్లే వారికి ఎదురయ్యే సమస్యలు అనేకం. గిరిజన తెగకు చెందిన ప్రజలుగా తమకు అందాల్సిన, దక్కాల్సిన పథకాల విషయంలోనూ ఎంతో అన్యాయం జరుగుతోందని చెబుతున్నారు.
దశాబ్దాల నాటి సంస్కృతి
దశాబ్దాలుగా వీరి జీవనం ఇక్కడే కొనసాగుతోంది. పీఎంపాలెం నుంచి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామం అక్కడి పచ్చని అందాలు.. ఎవరినైనా కట్టి పడేస్తాయి. రణగొణ ధ్వనుల నుంచి కొద్ది నిమిషాల ప్రయాణం చేస్తే మనసును గాలిలో తేలినట్టు చేసే వాతావరణాన్ని పరిచయం చేస్తుంది ఈ గిరిజన గ్రామం. పూర్వీకుల జీవన శైలి, ఆనాటి పద్ధతులు, ఆహారపు అలవాట్లు, ఇలా ఏ విషయంలో చూసినా దశాబ్దాల నాటి సంస్కృతి, సంప్రదాయాలను ఇక్కడి ప్రజలు కొనసాగిస్తూ కాపాడుకుంటున్నారు.
ఈ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల్లోని నర్సరీలు వంటి వాటిలో పని చేస్తుంటారు. ఎక్కువమంది సాగుకు ప్రాధాన్యత ఇస్తారు. అటవీ శాఖ ఆంక్షలు ఉన్నందున తమకు అవకాశం ఉన్న పరిమిత భూమిని మాత్రమే వినియోగించుకుంటూ సాగుచేయడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత. ఇంటి అవసరాలకు సరిపడ కూరగాయలను ఇక్కడ సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తుంటారు. పాడికి సైతం ఈ గ్రామంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కోళ్లు, మేకలు పెంపకం చేస్తారు.
ఈ గ్రామానికి రవాణా సమస్యను తీర్చాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు గ్రామం దాటి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.