నేరస్థులను పట్టుకోవడం కంటే నేరాన్ని అడ్డుకోవడంపై పోలీసుశాఖ(Ts Police) దృష్టి సారించింది. పోలీసులు తక్షణమే స్పందించగలిగితే చాలావరకూ నేరాలను నిరోధించవచ్చు. పోలీసుశాఖలో ఏళ్లతరబడి పేరుకున్న అలసత్వం కారణంగా ఫిర్యాదు చేసినప్పటికీ సంఘటనా స్థలానికి చేరుకోవడానికి చాలా సమయం పడుతోంది. చేరుకున్నాక కూడా సమస్యను అర్థం చేసుకొని, పరిష్కరించే విషయంలో విఫలమవుతున్నారు. దీన్ని చక్కదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏడు వేల మంది గస్తీ సిబ్బందికి మూడు దశల్లో శిక్షణను ప్రారంభించారు. సంఘటనా స్థలానికి మొదట చేరుకునేది వీరే కాబట్టి.. క్షేత్రస్థాయిలో పరిస్థితి చేయిదాటకుండా చూడటమెలాగో వీరికి అధికారులు నేర్పుతున్నారు. ఐదు రోజులపాటు కొనసాగే శిక్షణ సోమవారం మొదలైంది.
మూడు సాఫ్ట్ స్కిల్స్ బోధన
- గస్తీ సిబ్బందికి ప్రధానంగా 3సాఫ్ట్ స్కిల్స్ బోధిస్తున్నారు. బాధితులు, ఫిర్యాదుదారులతో సావధానంగా మాట్లాడటం ఇందులో ప్రధానమైంది.
- ఏదైనా గ్రామంలో ఇరువర్గాలు ఘర్షణ పడుతుంటే వారిని చర్చల ద్వారా శాంతింపజేసే మెలకువలు బోధిస్తున్నారు.
- గస్తీ సిబ్బందికి వారు నిర్వర్తించాల్సిన అయిదు విధుల (ప్రొఫెషనల్ స్కిల్స్)పైనా శిక్షణ ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన అంశాలను ఇందులో బోధిస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌కి సుమారు 2,300 మంది చొప్పున 7,000 మందిని మూడు బ్యాచ్‌లుగా విభజించారు. ఒక్కో బ్యాచ్‌కి అయిదేసి రోజులపాటు ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణకు ఎంపికైనవారు తమ తమ పోలీస్‌స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతి గదిలో హాజరవుతారు.