భాజపా తెలంగాణలో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. డబ్బుల సంచులతో కాంగ్రెస్ వాళ్ల ఇళ్లకు వెళ్లి నాయకులను కొనుక్కోవాలని చూస్తుందని ఆరోపించారు. కేంద్రం హైదరాబాద్‌కు ఏమి చేసిందని గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని నిలదీశారు. భూపేందర్ యాదవ్ వేరే పార్టీల నాయకులను కొనుగోలు చేయడానికి రాష్ట్రానికి వచ్చినట్లు ఉన్నారని విమర్శించారు.
ఏడేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు. కొనుగోలు రాజకీయాలు మాని.. హైదరాబాద్‌కు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం, భాజపాల మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే బిహార్‌లో ఎంఐఎం పోటీ చేసిందన్నారు. ఒవైసీ సోదరులు అమిత్ షాతో కలిసినట్టు కేజ్రీవాల్ చెప్పారని, కాంగ్రెస్ ఓట్లు చీల్చాలనే ఎంఐఎం చూస్తోందని ధ్వజమెత్తారు.
భాజపా ఓట్లు ఎలా అడుగుతోంది?
‘‘కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం చేసిందని ప్రజలను భాజపా ఓట్లు అడుగుతుంది. డబ్బుల సంచులతో కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లి కొనాలని చూస్తుంది. భూపేందర్ యాదవ్ వేరే పార్టీల నాయకులను కొనుగోలు చేసేందుకే రాష్ట్రానికి వచ్చినట్లు ఉన్నారు. కొనుగోలు రాజకీయాలు మానుకొని హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పండి? మజ్లిస్, భాజపా మధ్య రహస్య ఒప్పందం ఉంది. ఈ రెండు పార్టీలూ మతతత్వ పార్టీలే" -ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్
ఇవీ చూడండి: వరదసాయం తీసుకున్న వారికి మళ్లీ సాయం: బండి సంజయ్