Reavnth Comments on Polavaram: పోలవరం ఎత్తు పెంచడమే వరదలకు కారణమైతే.. ఇన్నాళ్లు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్చ జరగకుండా చేసేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని రేవంత్ ఆరోపించారు. దిల్లీలో.. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, రేవంత్‌రెడ్డి సమక్షంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఖర్గే.. కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్‌రెడ్డి రావటం వల్ల హుస్నాబాద్‌లో కాంగ్రెస్ మరింత బలోపేతం కానుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి పొలవరంపై మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వరదలకు కారణం క్లౌడ్ బరస్ట్ అని కేసీఆర్ చెప్పింది నమ్మాలా..? పోలవరం వల్లే అని అజయ్ చెప్పింది నమ్మాలా..? అని రేవంత్ నిలదీశారు. పొలవరాన్ని సాంకేతికంగా పరిశీలించాలని.. ఒకవేళ నిజమే అయితే ఇన్ని రోజులు ఎందుకు అభ్యంతరం తెలపకుండా ఏం చేశారని నిలదీశారు. సమస్యల్ని పక్కదోవ పట్టించేందుకే ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు.
"వరదలు వస్తే అప్రమత్తం చేయాల్సిన సీఎం.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలా.. వద్దా..? అని ఆలోచిస్తున్నారు. జనం ఇబ్బందులు పడుతుంటే.. రాజకీయ ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చేసిన విదేశాల కుట్ర.. క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు... అత్యంత నిర్లక్ష్యమైనవి. పోలవరం ఎత్తు పెంచడమే వరదలకు కారణమైతే.. ఇన్నాళ్లు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసింది..? పొలవరాన్ని సాంకేతికంగా పరిశీలించాలి.. నిజమే అయితే ఇన్ని రోజులు ఎందుకు అభ్యంతరం వెలిబుచ్చలేదు. అవినీతిపై చర్చ జరగకుండా చేసేందుకే ఈ అంశాలను తెరపైకి తెచ్చారు. కేసీఆర్ చెప్పింది నమ్మాలా..? అజయ్ చెప్పింది నమ్మాలా..? సమస్యల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు విదేశాల కుట్ర అన్నారు.. ఇపుడేమో పక్క రాష్ట్రాల కుట్ర అంటున్నారు. ఇంకోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ పరిశీలక బృందాలను రాష్ట్రానికి పంపలేదు. 21 నుంచి తెలంగాణలో భాజపా కార్యక్రమాలు అంటున్నారు. ప్రజలు భాజపాను అడ్డుకోవాలి. తెలంగాణ ప్రజల ప్రాణాలంటే భాజపాకు విలువ లేదు. వాళ్లను తెలంగాణకు రానిస్తే.. మరింత ప్రమాదం జరుగుతుంది. తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుంది." -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చూడండి: