ఎంతో ఉత్కంఠ నెలకొన్న పీసీసీ అధ్యక్ష పీఠం ఎట్టకేలకు ఎంపీ రేవంత్‌రెడ్డిని వరించింది. రాష్ట్ర రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన ఆయన... మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో అనుముల నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్న రేవంత్‌రెడ్డి... 2006లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో.... మిడ్జిల్ జడ్పీటీసీ స్థానానికి స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం, శాసనమండలి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించారు. తర్వాత తెదేపా కండువా కప్పుకున్న రేవంత్‌రెడ్డి... 2009 ఎన్నికల్లో తొలిసారి కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం మరోసారి అదే పార్టీ నుంచి విజయం సాధించి... 2017 వరకు తెదేపా శాసనసభాపక్ష నేతగా పనిచేశారు.
రేవంత్‌కు రెడ్‌కార్పెట్...
రాష్ట్ర విభజన అనంతరం, తెరాస బలపడటం.... తెదేపా ఏపీకే పరిమితం కావటంతో రేవంత్‌రెడ్డి.... 2017లో కాంగ్రెస్‌లో చేరుతూ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాదరణ ఉన్న ఆయనకు రెడ్‌కార్పెట్ వేసిన కాంగ్రెస్... వెంటనే కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. నాటి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయ్యే వరకు ఆయన వర్కింగ్ ప్రెసిడెంటుగా కొనసాగుతూ వచ్చారు.
కలిసొచ్చిన దూకుడు...
తెరాస ప్రభుత్వంతోపాటు ఆ పార్టీ ముఖ్యనేతలే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్లడం రేవంత్‌రెడ్డికి కలిసొచ్చింది. ఈ క్రమంలోనే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి మరోసారి పోటీ చేసిన ఆయన... అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. 2019లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి.. ఎంపీగా గెలుపొందారు. 2019 సెప్టెంబరు నుంచి రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ కన్సల్టేటివ్ కమిటీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ, వాతావరణ మార్పు కమిటీల్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో తక్కువ కాలంలో... ఎక్కువ పదవులు దక్కించుకోవడం, అంచలంచలుగా ఎదగడానికి ఆనేక అంశాలు దోహదపడ్డాయని చెప్పొచ్చు. ప్రధానంగా విషయాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, ప్రత్యర్థులపై విమర్శలను తూటాల్లా పేల్చడం లాంటి ఎన్నో అంశాలు రేవంత్... రాజకీయ ఎదుగుదలకు తోడ్పాటు అందించాయి.
పార్టీని నడిపించే నాయకుడిగా..
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ప్రచార సభల్లో వచ్చిన స్పందనతో పార్టీలో రేవంత్ ప్రత్యేక గుర్తింపు పొందారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారడం...., తెరాస, భాజపాకు దీటుగా పార్టీ శ్రేణులను ముందుకు నడిపించే నాయకుడికోసం అన్వేషించిన కాంగ్రెస్ పెద్దలు.. ప్రత్యర్థులకు తన ప్రశ్నలతోనే ముచ్చెమటలు పట్టించే... రేవంత్‌రెడ్డికే ఆ బాధ్యతలు అప్పగించారు.