దేశ వ్యాప్తంగా సినిమాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో.. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో కూడా అనుమతులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో దట్టమైన అడవులు, రిజర్వాయర్లు, జలపాతాలు, దేవాలయాలు ఉన్నాయని.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన సినిమాలు తీయవచ్చని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
రవీంద్రభారతిలోని తన ఛాంబర్‌లో సినీ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, కె.ఎస్.రామారావు, ఆదిశేషగిరిరావుతో శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమాల చిత్రీకరణకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు. పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వివరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.