దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తొలి పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన అప్పికట్ల జోసెఫ్ 25వ వర్ధంతి సందర్భంగా ఆయన పేరుతో తపాలా కవరు, స్టాంపును పోస్టల్‌శాఖ విడుదల చేసింది. ఏపీలో విజయవాడలోని ఎం.బి.వి.కె.భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే.. సమాజంలోని సాంఘిక దురాచారాలు, అసమానతలను తొలగించేందుకు అప్పికట్ల జోసెఫ్ కృషి చేశారు. అందరికీ విద్య చేరువ చేయాలనే లక్ష్యంతో విద్యా సంస్థలను నెలకొల్పారు. గాంధేయవాదంతో ముందుకు సాగిన ఆయన.. స్వాతంత్య్రానంతరం 1949-52 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు.
చిన్న వయసులోనే రాజకీయ అరంగేట్రం
గుడివాడ మండలం వెంట్రప్రగడ గ్రామంలో 1917లో అప్పికట్ల భూషణం, దుర్గమ్మ దంపతులకు తొలి సంతానంగా జోసెఫ్ జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తల్లితో కలిసి ఆమె సొంతూరైన అంబాపురం వచ్చేశారు. ఉయ్యూరు క్రైస్తవ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటూనే.. సెలవుల్లో కూలి పని చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు. మెట్రిక్యులేషన్ పూర్తిచేసిన తర్వాత చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మహాత్మాగాంధీ పిలుపుతో జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొని సన్నిహితులు మహమ్మద్ యాసిన్, సిరిపురం కోటేశ్వరరావుతో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.
జైలు జీవితం
1940లో కోస్తా ప్రాంతంలో ముసునూరు, ఆగిరిపల్లిని కేంద్రంగా చేసుకుని స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపించిన ఏకైక మాదిగ క్రైస్తవ కాంగ్రెస్ యువ నాయకుడు అప్పికట్ల జోసెఫ్ అంటూ.. ప్రఖ్యాత రచయిత బిపిన్‌చంద్ర తాను రాసిన ఇండియన్ నేషనల్ మూమెంట్, దలాంగ్ టర్మ్ డైనమిక్స్ పుస్తకాల్లో పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాకాని వెంకటరత్నం, ఘంటసాల వెంకటేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్.జి.రంగా, అయ్యదేవర కాళేశ్వరరావు, తెన్నేటి విశ్వనాథం, గొట్టిపాటి బ్రహ్మయ్య, గౌతు లచ్చన్న లాంటి ఉద్దండులతో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. ఉద్యమంలో భాగంగా జోసెఫ్ ఏడాదికి పైగా జైలు జీవితం గడిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా, కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీకి కార్యనిర్వాహక కార్యదర్శిగా జోసెఫ్ సేవలందించారు.
రైతు కుటుంబాల కోసం..
విజయవాడలో సామాన్య మధ్య తరగతి, రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేందుకు అప్పికట్ల జోసెఫ్ ఆధ్వర్యంలో పాల ప్రాజెక్టును ప్రారంభించారు. చర్మకారుల ఆర్థిక స్థాయిని వృద్ధి చేయడానికి లిడ్ క్యాప్ డైరెక్టర్‌గా ఆరేళ్లు పనిచేశారు. ఆనాటి కేంద్రమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో విజయవాడ రైల్వే జంక్షన్‌ను ఏర్పాటు చేయించిన ఘనత జోసెఫ్‌కే దక్కుతుంది. బడుగు వర్గాల జీవితాల్లో మార్పు రావాలంటే విద్యతోనే సాధ్యమని నమ్మి.. ఆంధ్రకేసరి పేరుతో ఎస్సీ బాలుర వసతి గృహాలు నిర్మించారు. తన తండ్రి అప్పికట్ల భూషణం పేరుతో మెమోరియల్ పాఠశాలను స్థాపించి, ఎందరో బడుగు బలహీన వర్గాల వారికి విద్యాదానం చేశారు. విజయవాడలోని లంబాడీపేటలో ఎస్సీ, గిరిజన విద్యార్థుల కోసం పాఠశాలను ఏర్పాటు చేశారు. అక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నతస్థానాలకు ఎదిగారు. అప్పికట్ల జోసెఫ్ 1996, ఆగస్టు 31న తుదిశ్వాస విడిచారు.
ఇదీ చూడండి: Venkaiah Naidu: 'ప్రజాప్రతినిధులను సంస్కరించాల్సింది ప్రజలే'