గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలో ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావటంపై తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. గ్రేటర్‌లో ఓటింగ్ శాతం తగ్గడానికి కారణం కొవిడ్, గ్రామాలకు తరలివెళ్లడం ఒక కారణమైతే... నగర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయకపోవడం ప్రధాన కారణమని పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికలను నగర అభివృద్ధికి కాకుండా... రాష్ట్రంలో రాజకీయ అధిపత్యం కోసం అన్నట్లుగా సృష్టించారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ... దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు తెజస సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కోదండరాం తెలిపారు. రైతులు చేస్తున్న పోరాటాలకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా జన సమితి నాయకులు వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఈ పోరాటం వారి సమస్యల పరిష్కరానికి ఒక మార్గం చూపుతుందని ఆశాభవం వ్యక్తం చేశారు.