Tirumala Hundi Income : కొవిడ్ పరిస్థితుల అనంతరం ఏప్రిల్ నుంచి సర్వదర్శనం భక్తులను అనుమతిస్తుండడంతో తిరుమల శ్రీవారి హుండీ కానుకలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో రూ.128 కోట్లు, ఏప్రిల్‌లో రూ.127.5 కోట్లు, మేలో రూ.130.5 కోట్లు, జూన్‌లో రూ.123.76 కోట్లు మొత్తంగా 4 మాసాల్లో రూ.509.76 కోట్ల హుండీ కానుకలు లభించాయి. గత సోమవారం ఒక్కరోజే రూ.6.18 కోట్లు వచ్చాయి.
తితిదే చరిత్రలో రూ.6 కోట్లకు పైగా రావడం ఇది రెండోసారి. స్వామివారికి సోమవారం ఓ అజ్ఞాత భక్తుడు రూ.1.64 కోట్లు సమర్పించారు. 1954 జూన్‌లో శ్రీవారికి రూ.5,35,703 హుండీ ఆదాయం లభించింది. 2015-16లో ఏకంగా రూ.1010 కోట్లు వచ్చాయి. కరోనాకు ముందు 2018-19 సంవత్సరంలో రూ.1206 కోట్లు రాగా, 2019-20, 2020-21 సంవత్సరాల్లో హుండీ ఆదాయం భారీగా తగ్గింది.
శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం దాదాపు 16 గంటల సమయం పడుతోంది. గదులు దొరక్క భక్తులు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం శ్రీవారిని 77,907 మంది దర్శించుకున్నారు. 38,267 మంది తలనీలాలు సమర్పించారు.
రేపు సెప్టెంబరు కోటా ఎస్‌ఈడీ టికెట్లు విడుదల.. సెప్టెంబరుకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం(ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను గురువారం ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో తితిదే విడుదల చేయనుంది. ఈనెల 12, 15, 17వ తేదీల్లోని రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.