
శ్వాస మీద ధ్యాస :
శ్వాస తీసుకుంటున్న తీరు మీద ధ్యాస నిలపండి. వేగంగా శ్వాస తీసుకుంటున్నట్టయితే నెమ్మదిగా, గాఢంగా తీసుకోవటానికి ప్రయత్నించండి. ఇది మనసు కుదుటపడటానికి తోడ్పడుతుంది. కడుపు మీద చేయి పెడితే శ్వాస తీసుకునే తీరును గమనించొచ్చు. నిమిషానికి సుమారు 6 సార్లు శ్వాస తీసుకునేలా సాధన చేయండి.

సంగీతం వినండి :
సంగీతం నిజంగానే మెదడును శాంత పరుస్తుంది. ఇది మెదడులో భయానికి ప్రతిస్పందించే అమిగ్డాలలో నాడీకణాలు అతిగా ఉత్తేజితం కాకుండా చేస్తుంది. నొప్పి భావననూ తగ్గిస్తుంది. ఏకాంతంలో సంగీతం వినటం మరింత మేలు. కల్లోల పరిచే ఆలోచనల నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది.

చిన్నపాటి నడక :
వేగంగా నడవటం వంటి తేలికైన వ్యాయామాలు 5 నిమిషాలు చేసినా చాలు. ఇవి ఉత్సాహం కలిగించే ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా చేస్తాయి. ఫలితంగా మూడ్, ఏకాగ్రత, నిద్ర మెరుగవుతాయి. వీలైతే కాసేపు వేగంగా, కాసేపు నెమ్మదిగా వ్యాయామాలు చేసే పద్ధతినీ పాటించొచ్చు.

ఇతరులకు సాయం :
వీలుంటే ఇతరులకు సాయం చేయండి. దీంతో ఒత్తిడిని ప్రేరేపించే మెదడులోని భాగాలు తేలికపడతాయి. ఇది మానసిక ఒత్తిడి తగ్గటానికి, ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడుతుంది. ఇతరుల కోసం ఖర్చు పెట్టినప్పుడు మెదడులో మరింత ఎక్కువగానూ ఎండార్ఫిన్లు విడుదలవుతాయి!

అలా కాసేపు ఆరుబయటకు :
ప్రకృతి మధ్యలో గడపటం మరింత స్పష్టంగా ఆలోచించేలా చేస్తుంది. దీంతో ఆందోళన తగ్గుతుంది. ఉత్సాహం ఇనుమడిస్తుంది. పచ్చని వాతావరణంలో మెదడు మీద పనిభారం తగ్గుతుంది. గుండె వేగం, రక్తపోటు, ఒత్తిడి హార్మోన్లు, కండరాల బిగువు సైతం తగ్గుముఖం పడతాయి.

పెంపుడు కుక్కతో ఆడుకోండి :
జంతువులను పెంచుకోవటం, వాటితో ఆడుకోవటం ద్వారా ఒత్తిడిని ప్రేరేపించే హార్మోన్లు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా ఆందోళన, తికమకపడటం, చిరాకు తగ్గుతాయి. విశ్వాసం, ప్రేమ, అనుబంధం వంటి వాటిల్లో పాలు పంచుకునే ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల కావటం దీనికి కారణం కావొచ్చు.

ఇష్టమైనవి తలచుకోండి :
ఇష్టమైన ఆటనో.. బీచ్‌లో సూర్యాస్తమయం వంటి దృశ్యాలనో, ఊహలనో ఒకసారి తలచుకోండి. ఆయా దృశ్యాలను సునిశితంగానూ గమనించండి. ఉదాహరణకు- పూల పరిమళాన్ని, స్పర్శను ప్రత్యక్షంగా ఆస్వాదిస్తున్న అనుభూతిని పొందొచ్చు. ఇది ప్రశాంతత, సంతోషం కలిగేలా చేస్తుంది.

హాబీలతో కాలక్షేపం :
బొమ్మలకు రంగులు వేయటం, అల్లికలు, తోట పని వంటి హాబీలతో మనసు దృష్టిని మళ్లించొచ్చు. ఒకేరకం కదలికలతో కూడిన పనులతో చికాకు పరిచే ఆలోచనలు పక్కదారి పడతాయి. ఏ పనైనా సంతోషం ముఖ్యం. ఫలితం గురించి బాధపడొద్దు. ఇంకేం మనసులోని చిన్నారిని బయటకు తీయండి.

మట్టి మరక మంచిదే :
వీలైతే పెరట్లో మట్టిని పిసకండి. కుండలు, బొమ్మల వంటివి చేయటానికి ప్రయత్నించండి. ఇది కాలక్షేపానికే కాదు, వ్యాయామంగానూ ఉపయోగపడుతుంది. అంతేకాదు, మట్టిలోని సూక్ష్మక్రిములు ఏకాగ్రత, ఉత్సాహం పెరగటానికి దోహదం చేయొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
- ఇదీ చూడండి : ఈ మూడూ ఉంటే ఆనందం మీ సొంతం!