అత్యవసర కేసుల కోసం మూడు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ విచారణ చేపట్టేందుకు హైకోర్టు మార్గదర్శకాలు రూపొందించింది. పిటిషన్లు, కోర్టు ఫీజు రశీదు, ఆధారాలు సహా పీడీఎఫ్ రూపంలో రిజిస్ట్రార్ జనరల్ కు ఈ-మెయిల్ పంపాలి. పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి పరిశీలించి... అత్యవసరమని భావించిన వాటిని విచారణకు అనుమతిస్తారు. న్యాయవాదికి విచారణ తేదీ, సమయం ఇతర వివరాలు ఫోన్, మెయిల్ ద్వారా సమాచారం పంపించనున్నట్లు మార్గదర్శకాలలో పేర్కోన్నారు.
పరిస్థితులు చక్కబడిన తర్వాత పిటిషన్, సంబంధిత పత్రాలన్నీ హైకోర్టుకు సమర్పించాలి. న్యాయవాదులు తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించొచ్చని రిజిస్ట్రార్ జనరల్ స్పష్టం చేశారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించలేని వారికోసం... సీఎం క్యాంపు కార్యాలయం పక్కన 3వ క్వార్టర్స్‌లోని కంట్రోల్ రూంలో ఏర్పాట్లు చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కోసం జూమ్ క్లౌడ్ మీటింగ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక చరవాణీకి వచ్చే లింక్ ద్వారా కోర్టు గదితో న్యాయవాది అనుసంధానం అవుతారు. విచారణ పూర్తయ్యాక న్యాయవాది కంట్రోల్ రూంలోని కోర్టు మాస్టర్‌కు న్యాయమూర్తి ఉత్తర్వులు చెబుతారు. ఉత్తర్వులపై న్యాయమూర్తి, జ్యుడిషియల్ రిజిస్ట్రార్ సంతకం చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నట్టు వివరించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు