ETV Bharat / city

కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక అయిదుగురు మృతి! - కింగ్ కోఠి ఆస్పత్రి తాజా వార్తలు

Three die at King Koti Hospital due to lack of oxygen
కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి
author img

By

Published : May 9, 2021, 6:15 PM IST

Updated : May 10, 2021, 6:10 AM IST

18:15 May 09

కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక అయిదుగురు మృతి

హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో అయిదుగురు కరోనా రోగులు మృతిచెందారు. ఆక్సిజన్‌ అందకపోవడం వల్లనే వీరంతా మరణించారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇందులో ముగ్గురు ఐసీయూలో... మరో ఇద్దరు వార్డుల్లో ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతున్నవారని తెలిసింది. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకూ ఆసుపత్రిలో నిల్వ చేసిన ఆక్సిజన్‌ సామర్థ్యం తగ్గడంతో.. చికిత్స పొందుతున్న రోగులకు తగినంత ఒత్తిడి(ప్రెషర్‌)తో ప్రాణవాయువు అందలేదని బంధువులు చెబుతున్నారు. శ్వాస అందక ఉక్కిరిబిక్కిరి అవుతూ రోగులు అల్లాడినట్లుగా తెలుస్తోంది. ఆయాసంతో కొట్టుమిట్టాడుతున్న తమ వారిని దక్కించుకోవడం కోసం బంధువుల ఉరుకులు పరుగులతో ఆసుపత్రి వాతావరణమంతా ఒక్కసారిగా గందరగోళంగా మారినట్లు సమాచారం. 

పరిస్థితిని గమనించిన వైద్యసిబ్బంది దిద్దుబాటు చర్యలు చేపట్టే లోపే అయిదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లుగా మృతుల కుటుంబ సభ్యులు వాపోయారు.  ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతున్న ఇతర రోగులు దాదాపు గంట పాటు నరకం చవిచూసినట్లుగా తెలుస్తోంది. ఉదయం 10 గంటలకే రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ సాయంత్రం 4 గంటలకు చేరుకొంది. ఈ జాప్యం కారణంగా ఘోరం జరిగినట్లు భావిస్తున్నారు. ఆ ట్యాంకర్‌ నుంచి ట్యాంకులోకి ఆక్సిజన్‌ను సరఫరా చేసి, అక్కడ్నించి రోగులకు పైపులైను ద్వారా అందించడానికి మరో గంట పట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం ఆక్సిజన్‌ సరఫరాలో ఎటువంటి లోపాలు జరగలేదనీ, రోగుల మరణాలకు ప్రాణవాయువు లోటు కారణం కాదని స్పష్టం చేశాయి.

ఏం జరిగింది?

350 పడకలున్న కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో 300 ఆక్సిజన్‌, 50 ఐసీయూ పడకలున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ రోగులతో నిండి ఉన్నాయి. వీరికోసం ప్రత్యేకంగా 13,000 కిలోలీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఉంది. నిత్యం ఈ ట్యాంకును పూర్తిసాయిలో నింపుతుంటారు. 60 శాతం ఆక్సిజన్‌ నిల్వలు అయిపోతున్నాయనే సంకేతం వెలువడగానే.. వెంటనే ట్యాంకర్‌ ద్వారా ఆక్సిజన్‌ రప్పిస్తారు.  ఇది ప్రతిరోజూ జరిగే ప్రక్రియ. వైద్యాధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సాంకేతిక సిబ్బందితో సమన్వయం చేసుకుంటుంటారు. శుక్రవారం నాటికి ట్యాంక్‌లో ఆక్సిజన్‌ తగ్గుతుందని గ్రహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రనాథ్‌.. ప్రాణవాయువును సరఫరా చేసే సంస్థకు సమాచారమిచ్చారు. కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రికి జడ్చర్ల నుంచి లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా జరుగుతోంది. అక్కడి నుంచి వచ్చే ట్యాంకర్లు.. ఉదయం 10 గంటలకల్లా ఆసుపత్రికి చేరుకొని.. అవసరాల మేరకు ఆక్సిజన్‌ ట్యాంకును నింపుతుంటాయి. 

ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఇచ్చిన సమాచారం మేరకు.. శనివారం మధ్యాహ్నం ఆక్సిజన్‌ ట్యాంకర్‌ జడ్చర్ల నుంచి బయలుదేరింది. ఆ రోజు రాత్రి వరకు కింగ్‌కోఠి ఆసుపత్రికి చేరుకోలేదు. అప్పటికే ఆసుపత్రి ట్యాంక్‌లో ఆక్సిజన్‌ నిల్వలు 50 శాతానికి వచ్చినట్టు సమాచారం. ఆదివారం ఉదయం నుంచి ఆసుపత్రి సూపరింటెండెంట్‌.. ట్యాంకర్‌ డ్రైవర్‌కు వరుసగా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. పలుమార్లు సమాధానం చెప్పిన ట్యాంకర్‌ డ్రైవర్‌ మధ్యాహ్నం తరువాత ఫోన్‌లో కూడా అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. నారాయణగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలో దిగిన పోలీసులు ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించారు. అప్పటికే ట్యాంకర్‌ శంషాబాద్‌ దగ్గరుంది. విషయం తెలుసుకొని డీసీపీ విజయ్‌కుమార్‌ శంషాబాద్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. 

పోలీసులు ‘గ్రీన్‌ ఛానెల్‌’ ద్వారా రవాణాకు ఆటంకం లేకుండా చేశారు. అయితే డ్రైవర్‌ ట్యాంకర్‌ను కింగ్‌కోఠికి తీసుకురాకుండా.. నేరుగా ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు వెంటనే తమ కానిస్టేబుళ్లను ఉస్మానియాకు పంపించి, అక్కడి నుంచి ట్యాంకర్‌ను కింగ్‌కోఠి ఆసుపత్రికి చేరేలా చేశారు. ఇదంతా జరిగే సరికి సాయంత్రం 4 గంటలైంది. అప్పటికే ఆసుపత్రి ట్యాంకర్‌లో ఆక్సిజన్‌ నిల్వ చివరి దశలోకి చేరినట్లుగా తెలిసింది. దీంతో చికిత్స పొందుతున్న బాధితులకు అవసరాలకు తగ్గట్లుగా ఒత్తిడితో ప్రాణవాయువు అందకపోవడంతో.. ఊపిరాడని పరిస్థితులు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రాణవాయువు అందక అయిదుగురు మృతిచెందినట్లు బంధువులు ఆరోపించారు. ఏప్రిల్‌ 30 నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళ(72), ఆదివారం ఆసుపత్రిలో చేరిన మరో మహిళ(50), రెండ్రోజుల క్రితమే చేరిన పురుషుడు(60), సాధారణ వార్డుల్లో ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు రోగులు మృతిచెందినట్లుగా కుటుంబ సభ్యులు ఆవేదన వెలిబుచ్చారు.

ఆక్సిజన్‌ సరఫరాకు ఇబ్బందుల్లేవు

ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడలేదు. మా దగ్గర చికిత్సలో, మౌలిక వసతుల్లో ఎటువంటి లోపం లేదు. మృతుల్లో ఆఖరి దశలో ఆసుపత్రిలో చేరినవారున్నారు.

 -నోడల్‌ అధికారి డాక్టర్‌ మల్లికార్జున్‌

నా భార్య ఆరోగ్యం మెరుగుపడింది. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా మాతో చక్కగా మాట్లాడింది. ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించింది. అంతవరకు 50 శాతం వరకు ఉన్న ఆక్సిజన్‌ ఒక్కసారిగా 20 శాతానికి¨ పడిపోయింది. డాక్టర్‌ కోసం పరుగులు పెట్టాం. వారొచ్చి ఆక్సిజన్‌ పైపులైన్‌ ఎక్కడో లీక్‌ అయిందని చెప్పారు. 10-15 నిమిషాల్లో అంతా అయిపోయింది. నా భార్య నన్ను విడిచి వెళ్లిపోయింది.

- ఓ బాధితుడి ఆక్రందన

మధ్యాహ్నం వరకు బాగానే ఉంది. ఒక్కసారిగా మా పేషెంట్‌కు ఆక్సిజన్‌ లెవల్స్‌, పల్స్‌ పడిపోయాయి. ఆక్సిజన్‌ ప్రెషర్‌ లేకపోవడమే కారణమని అంటున్నారు.

-మరో బాధితుడి ఆవేదన

ఒకవేళ మరింత ఆలస్యమైతే..?

రాష్ట్రంలో ఆక్సిజన్‌ సరఫరా నిరంతరాయంగా కొనసాగించేందుకు ప్రభుత్వం అన్ని  చర్యలు చేపట్టింది. ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు ప్రత్యేకంగా ప్రాణవాయువు సరఫరాపైనే పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొవిడ్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. రోజుకు 400 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందుల్లేకుండా అతి కష్టం మీద అవసరాలకు తగ్గట్లుగా ఆక్సిజన్‌ సరఫరా కొనసాగుతోంది. అన్ని ఆసుపత్రులకూ ఒకరోజు ముందుగానే.. సామర్థ్యంలో 60 శాతం కంటే తగ్గుతుండగానే ప్రాణవాయువు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకలు లభ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ కేసుల సంఖ్య మున్ముందు మరింతగా పెరిగితే.. అప్పుడు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ అవసరాలు కూడా పెరుగుతాయి. ఒకవేళ 24 గంటలు ఆలస్యంగా గనుక ఆక్సిజన్‌ ట్యాంకర్‌ అందితే ఎంతటి భయానక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందోననే ఆందోళన వైద్యవర్గాల్లోనూ నెలకొంది. దీన్ని అధిగమించడానికి 24 గంటల ముందే ఆసుపత్రి వద్ద అదనంగా ఆక్సిజన్‌ ట్యాంకర్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మరింత అప్రమత్తంగా కార్యాచరణ అమలు చేయాల్సి ఉందనే భావనలో అధికారులున్నారు. లేదంటే ఏరోజుకారోజు భర్తీ చేసే క్రమంలో ఇటువంటివి ఎదురైతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.

Last Updated : May 10, 2021, 6:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.