కొవాగ్జిన్‌పై వచ్చిన విమర్శలను భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల కొట్టిపారేశారు. కొవాగ్జిన్ 200 శాతం సురక్షితమని స్పష్టం చేశారు. తమ డాటాలో పారదర్శకత లేదన్నది పూర్తిగా అవాస్తవమన్నారు. కొన్ని భారతీయ కంపెనీలు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. కొవాగ్జిన్‌పై కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని... వదంతుల ద్వారా భారతీయ కంపెనీలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదంపై కృష్ణ ఎల్ల మీడియాతో మాట్లాడారు.
గ్లోబల్ లీడర్‌షిప్
"ప్రపంచ ప్రఖ్యాత జర్నల్స్‌లో భారత్ బయోటెక్‌పై 70కి పైగా వ్యాసాలు వచ్చాయి. యూకేలో కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాం. భారత్ బయోటెక్ దేశానికి సంబంధించినదే కాదు.. ఓ గ్లోబల్ కంపెనీ. వ్యాక్సిన్ల విషయంలో మాకు గ్లోబల్ లీడర్‌షిప్ ఉంది. అనేక దేశాల్లో భారత్ బయోటెక్‌కు భాగస్వాములున్నారు. చికున్ గున్యా సహా అనేక వ్యాధులకు వ్యాక్సిన్లు తయారు చేశాం. గతంలో తక్కువ మందిపై ప్రయోగాలు చేసిన విదేశీ కంపెనీలు అనుమతులు పొందాయి. కొవాగ్జిన్ సురక్షితమైన ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్."
- కృష్ణ ఎల్ల, భారత్ బయోటెక్ సీఎండీ
సంబంధిత కథనాలు: టీకా అనుమతులు వచ్చేశాయ్.. పంపిణీ ఎలా?
యూకే స్ట్రెయిన్‌పైనా పనిచేస్తుంది
యూకే స్ట్రెయిన్‌పై కూడా కొవాగ్జిన్ చక్కగా పనిచేస్తుందని కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు. తమ ప్రయోగ పద్ధతులను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆమోదించిందని తెలిపారు. భారత్ బయోటెక్ ఏ విదేశీ సంస్థకూ తీసిపోదని... ఫైజర్ వంటి విదేశీ సంస్థలతో సమానంగా పబ్లికేషన్స్ కలిగి ఉందన్నారు. 25 వేల మంది వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహించినట్లు తెలిపారు. వాలంటీర్లపై ప్రయోగాలు ప్రపంచంలోనే అతిపెద్ద ట్రయల్స్‌గా చెప్పొచ్చని వివరించారు. వ్యాక్సిన్ల అభివృద్ధిలో తమకు సుదీర్ఘ అనుభవం ఉందని... ఇప్పటివరకు 16 వ్యాక్సిన్లు రూపొందించినట్లు పేర్కొన్నారు.
సంబంధిత కథనాలు: టీకా కోసం ఈ వారమే భారత్ బయోటెక్‌తో ఒప్పందం
ఆ సామర్థ్యం ఏ కంపెనీలకు లేదు
"భారత్‌తో పాటు అనేక దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాం. 12 దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాం. ప్రపంచంలో భారత్ బయోటెక్ సంస్థకే బీఎస్‌ఎల్-3 ఉత్పత్తి సామర్థ్యం ఉందని చెప్పేందుకు గర్వపడుతున్నాను. అమెరికన్ కంపెనీల వద్ద కూడా లేని బీఎస్‌ఎల్-3 ఉత్పత్తి సామర్థ్యం మా సొంతం. ప్రపంచంలో ఎక్కడ ప్రజారోగ్య అత్యయిక స్థితి వచ్చినా సాయానికి మేం సిద్ధం. ప్రస్తుతం మా వద్ద 20 మిలియన్ల టీకా డోసులు ఉన్నాయి. 700 మిలియన్ల డోసుల తయారీ మా లక్ష్యం. భారతీయ శాస్త్రవేత్తలను టార్గెట్ చేస్తున్నారు."
- కృష్ణ ఎల్ల, భారత్ బయోటెక్ సీఎండీ
సంబంధిత కథనాలు: కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి
ధర తగ్గుతుంది
మొదట్లో వ్యాక్సిన్ ధర కాస్త ఎక్కువ అనిపించవచ్చని... ఉత్పత్తి పెరిగేకొద్దీ వ్యాక్సిన్ ధర తగ్గుతుందని సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. శాస్త్రవేత్తగా నైతిక బాధ్యతతో కష్టాలకోర్చి వ్యాక్సిన్ తయారు చేశామన్నారు. కరోనా కట్టడి కోసం నిబద్ధతతో వ్యాక్సిన్ రూపొందించినట్లు తెలిపారు. దేశంలో ఈ స్థాయిలో ఎప్పుడూ క్లినికల్ ట్రయల్స్ జరగలేదని వెల్లడించారు. భారత్ బయోటెక్ మిగతా కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఎన్నో స్టార్టప్‌లకు మార్గదర్శిగా నిలుస్తుందని కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు.
సంబంధిత కథనాలు: భారత్ బయోటెక్ టీకాకు నిపుణుల కమిటీ ఆమోదం
ముక్కు ద్వారా తీసుకుంటే సురక్షితం
ముక్కు ద్వారా తీసుకునే కరోనా టీకాను త్వరలోనే తీసుకొస్తామన్నారు. ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమని పేర్కొన్నారు. ముక్కు ద్వారా వ్యాక్సిన్ తీసుకుంటే ఇన్‌ఫెక్షన్, వ్యాప్తి నివారించవచ్చని వివరించారు.
సంబంధిత కథనాలు: కొవాగ్జిన్‌కు డీసీజీఐ లైసెన్సింగ్ అనుమతి