కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగిస్తుందన్న అంచనాల మేరకు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని ఈ నెలాఖరు వరకు నిషేధించాలని తితిదే యోచిస్తోంది. మార్చి 22న తొలుత వారం రోజుల నిషేధం ప్రకటించి తర్వాత ఈనెల 14 వరకు పొడిగించింది. తాజా పరిణామాలను బట్టి ఈ నెలాఖరు వరకు దర్శనం, సేవలను రద్దుచేసి స్వామివారి కైంకర్యాలను ఏకాంతంగా కొనసాగించనుంది. తిరుమల కనుమదారుల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా రద్దుచేసింది. తిరుపతి సమీప గ్రామాల్లో పేదలు, వలస కార్మికులు, యాచకులకు పూటకు 50వేల మందికి ఆహార పొట్లాలను తిరుమల అన్నదాన కేంద్రంలో తయారుచేసి అందిస్తోంది.
తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం ప్రారంభమైన యోగవాశిష్టం-శ్రీ ధన్వంతరి మహామంత్ర పారాయణాన్ని వేదపండితులు కొనసాగిస్తున్నారు. లోక కల్యాణార్థం, మానవాళి ఆరోగ్యం కాంక్షిస్తూ తితిదే ఈ క్రతువు చేపట్టి.. ఎస్వీబీసీలో ప్రసారం చేస్తోంది.