BJP National Working Committee Meetings: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు ‘విజయ సంకల్ప సభ’గా ఆ పార్టీ నామకరణం చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జులై 3న జరిగే ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య ప్రసంగం చేయనున్నారు. నగరంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సభకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ నేతలు నిర్ణయించారు. వేదికతో పాటు బహిరంగ సభలో పాల్గొనే ప్రజలకు వర్షంతో ఇబ్బంది కలగకుండా చూడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘లక్ష మంది సభికులకు జర్మన్ యాంగర్ ఏర్పాటు చేస్తాం. సభ జరిగే సమయంలో వర్షం పడ్డా ఇందులో ఉండేవాళ్లు తడవరు’ అని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి తెలిపారు.
ఇంటింటి ఆహ్వానాలు.. 3న జరిగే మోదీ సభకు రావాలని ప్రజల్ని పిలిచేందుకు భాజపా ఆహ్వాన పత్రికలు సిద్ధం చేసింది. మొత్తం 10 లక్షల ఆహ్వాన పత్రికలు ముద్రించినట్లు.. 29, 30 తేదీల నుంచి పట్టణాలు, గ్రామాల వారీగా ఇళ్లకు వెళ్లి వీటిని అందించనున్నట్లు భాజపా వర్గాల సమాచారం.
నేడు నగరానికి జాతీయ కార్యవర్గం ప్రతినిధులు..
విజయ సంకల్ప సభ విజయవంతం అయ్యేలా భాజపా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. నియోజకవర్గాల వారీగా పార్టీకి ప్రచారంతోపాటు సభకు జనసమీకరణకు ప్రత్యేక ప్రతినిధులను నియమిస్తోంది. ఈ క్రమంలో 24 మంది జాతీయ కార్యవర్గ ప్రతినిధులు బుధవారం నగరానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బృందం కార్యాచరణపై నాయకులకు, శ్రేణులకు పలు సూచనలు చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు రెండో తేదీ నుంచి ప్రారంభమయ్యే జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన సమాచారం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకూ ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని ముఖ్య కూడళ్లలో భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. నెక్లెస్‌రోడ్, బర్కత్‌పుర, నాంపల్లితోపాటు జనం గుమిగూడే ప్రాంతాల్లో ఇప్పటికే జెండాలు, ఇతర ప్రచార సామాగ్రిని అలంకరించారు. ప్రధాని మోదీ భారీ కటౌట్లు ఇప్పటికే కొన్నిచోట్ల ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక చేసినందుకు కృతజ్ఞతగా మోదీ సభకు గిరిజనులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరుతూ మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం ఆవిష్కరించారు.
ప్రధాని మోదీకి యాదమ్మ వంటకాలు..
జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా 3వ తేదీన ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌షా సహా నేతలకు తెలంగాణ శాకాహార వంటకాలు వడ్డించనున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పాకశాస్త్ర నిపుణురాలు యాదమ్మకు వంటల తయారీ బాధ్యతలు అప్పగించినట్లు భాజపా వర్గాలు తెలిపాయి. సర్వపిండి, సకినాలు, భక్షాలు, గంగవాయిలి కూర వంటి ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు.
ఇవీ చదవండి: