రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మూడోరోజు పక్కాగా అమలవుతోంది. ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. అత్యవసర పనులకు వెళ్లే వాళ్లతో పాటు మినహాయింపులు ఉన్నవారిని అనుమతిస్తున్నారు. మినహాయింపు వేళలైన ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మార్కెట్లు, దుకాణాలు రద్దీగా మారాయి. రంజాన్ కావడం వల్ల ముస్లింలు పండగ సామగ్రికోసం ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. పాతబస్తీలో కొనుగోళ్ల సందడి కనిపించింది. లాక్‌డౌన్ నిబంధనల అమలును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా పర్యవేక్షించారు. మక్కామసీదు, చార్మినార్ ప్రాంతాల్లో పర్యటించిన సీపీ ప్రజల సహకారాన్ని అభినందించారు.
బయటకు వస్తే కేసులే...
హైదరాబాద్ ఎర్రగడ్డ చెక్‌పోస్టును తనిఖీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తనిఖీ చేశారు. లాక్‌డౌన్ ఆంక్షలు, పరిస్థితిని పర్యవేక్షించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనదారులతో మాట్లాడిన సీపీ సజ్జనార్.. అనుమతి లేని వాహనాలపై కేసు నమోదు చేయించారు. ఉదయం10 గంటల తర్వాత ఎవరూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని సీపీ సూచించారు. నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని.. అనవసరంగా తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
అక్కడక్కడా నిర్లక్ష్యం...
జిల్లాల్లోనూ లాక్‌డౌన్ పక్కాగా అమలు చేస్తున్నారు. నిత్యావసర సరుకులు సమకూర్చుకునేందుకు సడలింపు సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. వరంగల్ వాసులు కొవిడ్ మార్గదర్శకాలు పాటించకుండా దుకాణాల వద్ద గుమిగూడారు. సిరిసిల్లలో ఎస్పీ రాహుల్ హెగ్డే క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా పరిధిలో 280 మందితో పాటు 12 దుకాణాలపై కేసులు నమోదు చేశామని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సడలింపు సమయం ముగిసినా... దుకాణాలు తీసే ఉండగా పోలీసులు మూసివేయించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో దుకాణదారులు లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘించగా జరిమానా విధించారు.