ఏ లోటు లేకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని తల్లి ఆరాటపడుతుంది. కూతురుకి సంబంధించిన అన్ని విషయాలనూ దగ్గరుండి మరి చూస్తుంది. కానీ లైంగిక జ్ఞానాన్ని అందివ్వడానికి ఎందుకో వెనకాడుతోంది. ఈ విషయంలో బిడ్డకు కనీస అవగాహన కల్పించకపోవడం రేపటి సమాజాన్ని కలవరపెడుతోంది.
యుక్త వయసులో లైంగిక పరిజ్ఞానం లేక ఎందరో అమ్మాయిలు... నయవంచకుల చేతుల్లో మోసపోయి గర్భం దాలుస్తున్నారు. ఆ పిల్లల్ని చెత్తకుప్పలపై, నిర్మానుష్య ప్రదేశాల్లోనూ విడిచిపెడుతున్నారు. దీనంతటికీ కారణం తల్లితో అంతగా మాట్లాడే చనువు లేకపోవడం. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలియకపోవడం.
టీనేజ్ అమ్మాయిలకు ఓ తల్లిగా మీరు చెప్పాల్సిన విషయాలు...
⦁ పరిచయస్తులు, బంధువుల ఒడిలో కూర్చోవద్దని హెచ్చరించండి.
⦁ మీ కూతురే కదా అని.. తన ఎదుట మీరు బట్టలు మార్చుకోవడం వంటివి చేయొద్దు.
⦁ 'ఇతను నిన్ను పెళ్లి చేసుకుంటాడు. నీ భర్త అవుతాడు' అని చెప్పి భవిష్యత్తులో జరిగే అనర్థాలకు కారణం కావొద్దు.
⦁ బయట పిల్లలతో ఆడుకునేటపుడు ఏమేం ఆటలు ఆడుతున్నారో గమనించండి.
⦁ ఎవరితోనైనా అసౌకర్యంగా అనిపిస్తోందని చెప్పినపుడు వారితో వెళ్లు, కూర్చో, మాట్లాడు అని బలవంతపెట్టకండి.
⦁ గలగల మాట్లాడే అమ్మాయి ఒక్కసారిగా మౌనం వహిస్తే కారణం ఏంటో అడిగి తెలుసుకోండి.
⦁ సెక్స్ అంటే సరైన అవగాహన కల్పించండి. లేదంటే సమాజం దాని గురించి తప్పుగా చెబుతుంది.
⦁ సెల్ఫోన్, కంప్యూటర్ లాంటి సాంకేతికత పరికరాలను ఉపయోగించే ముందు అందులో పేరెంట్ కంట్రోల్ మోడ్ ఉండేలా చూసుకోండి.
⦁ మూడేళ్ల వయసు నుంచే శరీర శుభ్రతపై అవగాహన ఏర్పరచండి. వేరొకరితో చనువుగా ఉండే ముందు ఆలోచించమని చెప్పండి.
⦁ హాని కలిగించే వస్తువులను, కుటుంబీకులను పిల్లల నుంచి దూరంగా పెట్టండి.
⦁ సముహాల మధ్య నిలబడాల్సి వస్తే ఎలా జాగ్రత్తపడాలో తెలపండి.
⦁ ఎవరి మీదనైనా మీ పిల్లలు ఫిర్యాదు చేస్తే ఆ విషయాన్ని విస్మరించకండి.
⦁ ఏదైనా సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేలా వారికి విలువలు నేర్పండి.
మీరు బతికున్నంత వరకు కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే.. ఆ ప్రభావం వారిపై జీవితాంతం ఉంటుందనే విషయాన్ని మరచిపోకూడదు.