అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేసేందుకు దోపిడీ నాటకం ఆడిన ఉద్యోగిని కూకట్‌పల్లి పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. పేరిశెట్టి దెన్దాదర్ కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలోని జై రాజేంద్ర జ్యువెల్ ప్యాలెస్ ప్రైవేటు లిమిటెడ్‌లో సేల్స్‌మెన్‌గా గత మూడు ఏళ్లుగా పని చేస్తున్నాడు. గత నెల 30వ తేదీన మధ్యాహ్నం బంగారు దుకాణం మేనేజర్ ఆదేశం మేరకు పదకొండు లక్షల యాభై వేల రూపాయల నగదును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు బయలుదేరాడు. దెన్దాదర్ దుకాణం సెల్లార్లో అపస్మారక స్థితిలో కాళ్ళు చేతులు కట్టివేసి పడి ఉండటం గమనించిన సహోద్యోగులు మేనేజర్‌కు సమాచారం అందించారు.
మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని దెన్దాదర్ను స్పృహలోకి తీసుకొచ్చారు. ఏం జరిగిందని వాకబు చేశారు. నలుగురు వ్యక్తులు తనపై దాడి చేసి కాళ్ళు చేతులు కట్టివేసి తన వద్ద ఉన్న డబ్బులు దోచుకెళ్ళారని తెలిపాడు. పోలీసులకు అనుమానం కలిగింది. దెన్దాదర్ కట్టుకథలు చెప్తున్నాడన్న సందేహం వచ్చింది. అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. తన స్నేహితుడు వినోద్ కుమార్‌తో కలిసి దోపిడీ నాటకం ఆడి డబ్బులు అపహరించినట్లు అంగీకరించాడు. నిందితుల వద్ద నుంచి డబ్బులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి: అమ్మవారి కన్నులు దోచుకెళ్లిన దొంగలు