Registration Dept Income: తెలంగాణలో సాగు భూముల క్రయవిక్రయాలు, సాగేతర రిజిస్ట్రేషన్ల ద్వారా రాబడిలో పెరుగుదల నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే ఇప్పటివరకు మొత్తం 3.24 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు కాగా.. రూ.2,192 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది తొలి రెండు నెలల్లో 2.09 లక్షల డాక్యుమెంట్ల ద్వారా రూ.765.91 కోట్లే వచ్చాయి. నిరుడు మే నెలలో కరోనా లాక్‌డౌన్ విధించడం ఆదాయంపై ప్రభావం చూపింది. రాష్ట్రంలో సాగు భూముల లావాదేవీలు భారీగా జరుగుతున్నాయి. గతేడాదితో పోల్చితే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు దాదాపు రెట్టింపు కావడం విశేషం. గతేడాది తొలి రెండు నెలల్లో 74,363 సాగు భూముల(ధరణి) డాక్యుమెంట్ల ద్వారా రూ.105.78 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 62,381 డాక్యుమెంట్ల ద్వారా రూ.188.96 కోట్లు, మే నెల పూర్తయ్యే నాటికి(30, 31 తేదీలు కలిపి) 62,500 డాక్యుమెంట్ల ద్వారా రూ.181.04 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. మొత్తంగా 1,24,881 డాక్యుమెంట్ల ద్వారా రూ.370 కోట్ల రాబడి ఖజానాకు చేకూరనుంది.
సాగేతర ఆదాయమూ అధికమే.. సాగేతర రిజిస్ట్రేషన్ల ఆదాయం గతేడాదితో పోల్చితే ఈసారి భారీగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలల్లో రెండు లక్షల డాక్యుమెంట్ల ద్వారా రూ.1822.14 కోట్ల రాబడి అంచనాగా ఉంది. ఏప్రిల్‌లో 1.06 లక్షల డాక్యుమెంట్లకు రూ.1003.18 కోట్లు, మే నెలలో (30, 31 తేదీలు కలిపి) 94 వేల డాక్యుమెంట్లతో రూ.818.96 కోట్ల రాబడి అంచనాగా ఉంది. గతేడాది తొలి రెండు నెలల్లో 1,34,720 డాక్యుమెంట్లకు రూ.660.13 కోట్ల రాబడి వచ్చిన విషయం విదితమే.
ఇవీ చదవండి: