కరోనా నియంత్రణ కోసం చేపట్టిన టీకాల పంపిణీ ప్రక్రియ... వేగంగా సాగుతోంది. అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌కి హైదరాబాద్ హైటెక్స్ వేదికైంది. మెడికోవర్ ఆస్పత్రి, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 40వేల మందికి ఒక్కరోజులో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ డ్రైవ్‌ని... సీపీ సజ్జనార్, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సంయుక్తంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మెడికోవర్ ఎండీ అనిల్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వ్యాక్సిన్ వేసుకోవటం ప్రతిఒక్కరి బాధ్యతని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరముందన్న డీహెచ్ శ్రీనివాసరావు... అందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు.
ఉత్తమమైన మార్గం వ్యాక్సినేషన్ ఒక్కటే...
కొవిడ్ మహమ్మారిని అడ్డుకునేందుకు ఉత్తమమైన మార్గం... వ్యాక్సినేషన్ ఒక్కటే అని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్‌లో... వృద్ధుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని ప్రారంభించిన ఆయన... అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పక టీకా తీసుకోవాలని సూచించారు. వివిధ వృద్ధాశ్రమాల్లో నేరుగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సంచార వాహనాల్ని అధికారులతో కలిసి సీఎస్ ప్రారంభించారు.కోఠి యూనియన్ బ్యాంకు జోనల్ కార్యాలయంలో బ్యాంకుఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమేశ్‌కుమార్ ప్రారంభించారు. యూనియన్ బ్యాంకు జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్యా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి హాజరయ్యారు. హైదరాబాద్ జోన్ పరిధిలోని ఉద్యోగులకు, వారి కుటుంబాలకు వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రత్యేక యాప్
నగరాల్లోని అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెన్షియల్ కాలనీల్లో కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక యాప్‌ను యునైటెడ్ ఫెడరేషన్ ఫర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ రూపొందించింది. యూ-ఫెర్వాస్ మొబైల్‌యాప్‌ను వర్చువల్ సమావేశంలో ఐటీ శాఖముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా విస్తృతంగా చేపడుతున్న టీకా కార్యక్రమానికి ఇలాంటి వేదికలతో ముందుకు రావడం అభినందనీయమని జయేశ్ రంజన్ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు వీలుగా భారత్ బయోటెక్ నాలుగు లక్షల డోసులు ఇచ్చేందుకు అంగీకరించిందని జయేశ్ రంజన్ తెలిపారు.
జోరుగా వ్యాక్సినేషన్
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఐదు టీకా సెంటర్లను ఏర్పాటు చేయగా టోకెన్లు ముందుగా తీసుకున్నవారికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. టీకా కోసం వరుస కట్టిన వారు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్ల కరోనా ప్రబలుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొత్త రకం వ్యాధి!