రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాల నిరోధం కోసం శ్రీనిధి మహిళా సంఘాల సభ్యులనే షీ టీంలుగా ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. గ్రామాల్లో మహిళల రక్షణ బాధ్యతలు శ్రీనిధి సభ్యులకు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై సీఎం స్థాయిలో చర్చ జరుగుతోందని తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన శ్రీనిధి పరపతి సహకార సమాఖ్య సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'శ్రీనిధి' యాప్ ఆవిష్కరణ
ఆర్థిక లావాదేవీలు పారదర్శకత కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన 'శ్రీనిధి' యాప్ను మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన సెర్ఫ్, మెప్మా అధికారులు, సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న శ్రీనిధి మహిళా సభ్యులకు మంత్రి పురస్కారాలు అందజేశారు. అనంతరం సభ్యులకు ప్రోత్సాహక నగదు, రుణాల చెక్కులు పంపిణీ చేశారు. శ్రీనిధి సభ్యులకు ఎక్స్ గ్రేషియా 50 నుంచి లక్ష రూపాయలకు పెంపుతో పాటు, పక్కా గృహాల నిర్మాణానికి రుణాలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. జనవరి 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.