రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయకారిగా ఉంటామని సైనిక ఉన్నతాధికారులు మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రహదార్ల మూసివేత సహా ఇతర సమస్యలు, అంశాలపై మంత్రి కేటీఆర్‌తో సైనికాధికారులు సమావేశమయ్యారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని రహదార్ల మూసివేత అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర ఆవిర్భావం మొదలు హైదరాబాద్‌లో పెద్దఎత్తున మౌలికవసతులు అభివృద్ధి చేస్తున్నామన్న కేటీఆర్... అన్ని వైపులా భారీ ఎత్తున రహదార్ల నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టినట్లు వివరించారు.
ఈ క్రమంలో సైనికప్రాంతాల్లో సైతం మౌలికవసతుల కల్పన జరిగిందని కేటీఆర్ అన్నారు. అయితే స్కైవేల నిర్మాణం తదితరాలకు సంబంధించి కేంద్ర రక్షణశాఖ మంత్రులు, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా.. సానుకూల స్పందన రాలేదని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో పదేపదే రహదార్ల మూసివేతతో మల్కాజిగిరి లాంటి ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేటీఆర్ వివరించారు.
రహదార్ల మూసివేత విషయమై సైనికాధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు త్వరలోనే సంయక్తంగా తనిఖీ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. మెహిదీపట్నం ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో బుల్కాపూర్ వరద నాలా విస్తరణకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మెహిదీపట్నం చౌరస్తాలో నిర్మించతలపెట్టిన స్కైవాక్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసేందుకు సహకరిస్తామని సైనికాధికారులు తెలిపారు. గోల్కొండ గోల్ఫ్ కోర్స్, డాలర్ హిల్స్ మీదుగా నెక్నాంపూర్ వైపు లింకు రోడ్ల నిర్మాణానికి సైతం సహకరిస్తామని చెప్పారు.
ప్రజల అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలతో కలిసి పనిచేస్తామని సైనికాధికారుల బృందం కేటీఆర్‌కు హామీ ఇచ్చింది. సైనికులకు సంబంధించిన ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గౌరవ దృక్పథంతో ముందుకు పోతోందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వాసి సంతోష్ బాబు మొదలు గాల్వాన్ లోయ అమరులను గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దక్షిణ భారత లెఫ్టినెంట్ జనరల్ అరుణ్‌తో పాటు ఇతర సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: