ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దు అంశాన్ని తెదేపా ఎంపీ కనకమేడల రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మండలి రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. ప్రస్తుతం ఆ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని వెల్లడించారు.
ఏంటి మండలి రద్దు.. అసలేం జరిగింది..
ఏపీ పాలన వికేంద్రీకరణ( మూడు రాజధానుల బిల్లు), సీఆర్టీఏ రద్దు బిల్లులను.. ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఆమోదించింది. అనంతరం ఆయా బిల్లులు శాసన మండలికి చేరాయి. మండలిలో తక్కువ సభ్యులున్న అధికార వైకాపా అనుకున్నట్లుగానే.. బిల్లులకు బ్రేకులు పడ్డాయి. మండలిలో సంఖ్యాపరంగా ఎక్కువ సభ్యులున్న తెలుగుదేశం.. ఆయా బిల్లులపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఫలితంగా రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని.. అప్పటి మండలి ఛైర్మన్ షరీఫ్.. కీలక నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన.. ముఖ్యమంత్రి జగన్ మంత్రులు, అధికార పార్టీ నేతలు.. అప్పటి మండలి ఛైర్మన్ చర్యలను తప్పుపట్టారు. ఫలితంగా ఏకంగా మండలినే రద్దు చేయాలని నిర్ణయించింది.. వైకాపా ప్రభుత్వం. అప్పట్లో మండలిపై ముఖ్యమంత్రి జగన్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు ఎన్నుకున్న శాససభ ఆమోదించిన బిల్లులను సైతం రాజకీయ కారణాలతో మండలి అడ్డుపడుతోందని ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. అందుకే శాసనమండలిని రద్దు చేస్తున్నామని శాసనసభలో ప్రకటించారు. ప్రజాప్రయోజనాలు పట్టని ఈ వ్యవస్థను రద్దుచేస్తున్నామని చెప్పడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.
వెనువెంటనే ఏపీ కేబినెట్ సైతం మండలి రద్దుకు పచ్చజెండా ఊపింది. శాసన సభలో సీఎం జగన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అనుకూలంగా 133, వ్యతిరేకం, తటస్థంగా 0 ఓట్లు వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్‌లో మూడింట రెండొంతులకు మించి సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో....శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్లు సభాపతి తమ్మినేని ప్రకటించారు.
వెంటనే శాసనసభ ఆమోదించిన ప్రతిపాదనను ఈ ఏడాది జనవరిలో కేంద్రానికి.. ఏపీ ప్రభుత్వం పంపింది. క్షేత్రస్థాయి పరిస్థితులను నిశితంగా పరిశీలించిన కేంద్రం.. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనపై వేచి చూసే ధోరణిని అవలంభించింది.
ఇదీచూడండి: శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తికి అభ్యంతరం లేదు: తెలంగాణ