వినాయక నిమజ్జనం(GANESH IMMERSION) ఆంక్షలు, నియంత్రణలపై నేడు హైకోర్టు ఉత్తర్వులను వెల్లడించనుంది. హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనం చేయవద్దంటూ న్యాయవాది వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల వాదనలు జరిగాయి. కొవిడ్ నేపథ్యంతో పాటు.. హుస్సేన్ సాగర్ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని గణేశ్ నిమజ్జనం నియంత్రణలపై సూచనలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
జీహెచ్ఎంసీలో(GHMC) హుస్సేన్‌సాగర్‌తో పాటు 48 చెరువులు, కొలనుల్లోనూ వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. మట్టి గణపతులను(CLAY GANESH IDOLS) పూజించాలని సూచించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. అయితే సూచనలు అవసరం లేదని.. స్పష్టమైన మార్గదర్శకాలు, చర్యలు ఉండాలని హైకోర్టు తెలిపింది. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్థితులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.
అలా చేస్తే ప్రజాధనం వృథా
కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. నగరవ్యాప్తంగా ఎక్కడికక్కడ స్థానికంగా నిమజ్జనం చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఏడాది పొడవునా.. వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నారని.. నిమజ్జనం సమయంలో వాటన్నింటినీ తొలగిస్తున్నారని.. దానివల్ల ప్రజాధనం వృథా అవుతోదందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అందరి సూచనలను తమ ముందుంచితే.. వాటన్నింటినీ పరిశీలించి ఈ నెల6న తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది.
జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీ(HYDERABAD CP) నివేదికలు సమర్పించడంలో శ్రద్ధ చూపడం లేదని ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించనుంది.
ఏదీ ప్రత్యామ్నాయం!
సెప్టెంబరు 10న వినాయచవితి, 21వ తేదీన నిమజ్జనోత్సవం ఉంటుంది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లో సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశిస్తే పరిస్థితి ఏంటన్నది అర్థం కావడంలేదు. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ రూపొందించలేదు. కర్ణాటకలో విజయవంతమైన మినీ నిమజ్జన కొలనులను నగరంలో 150 చోట్ల నిర్మించాలని రెండేళ్ల కిందట నిర్ణయించి 30 మాత్రమే నిర్మించారు. మహానగరంలో 185 చెరువులున్నాయి. వాటి వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారా అంటే అదీ లేదు. ‘ఈ ఏడాదికి పరిమితంగా అయినా సాగర్‌లో నిర్వహించి, వచ్చే ఏడాది నుంచి నిలిపేస్తే సరిపోతుంది. ఈమేరకు హైకోర్టు అనుమతి తీసుకుంటే బాగుంటుంది. ఈ ఏడాది సాగర్‌లో నిమజ్జనాన్ని నిలిపేస్తే ఇబ్బందులు తప్పవు’ అని బల్దియా ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
సంబంధిత కథనాలు..