ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. ఈ నెల 19 వరకు రాత్రిపూట కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత ఏం చేయాలనేదానిపై ఈ నెల 20 లోపు నిర్ణయం తీసుకోవాలి. మంత్రిమండలి సమావేశం నిర్వహించి, అందులో చర్చించి ఉత్తర్వులు జారీ చేయాలి. మరోవైపు పల్లె, పట్టణ ప్రగతి పనుల పరిశీలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఈ నెల 20న మొదలు కానున్నాయి.
జిల్లా కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు సీఎం ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రిమండలి సమావేశం జరిగేది అనుమానంగా మారింది. ఆ పరిస్థితి ఉంటే సీఎం కేసీఆర్ మంత్రుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఆదేశాలు ఇచ్చే వీలుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ కరోనా కేసుల తగ్గుదలపై రోజువారిగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తోంది. లాక్‌డౌన్ ఇకపై అవసరం లేదనే భావనతో ఆ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 21 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచిత టీకాల కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నేపథ్యంలో 20 నుంచి లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేతకు ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.