వ్యవసాయేతర ఆస్తుల విలువ బాగా తక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో రెట్టింపు, ఇంకొన్నిచోట్ల మూడు రెట్లు కూడా పెంచేందుకు సర్కారు నిర్ణయించింది. సగటున వ్యవసాయేతర భూములు, ఇళ్ల విలువ 25 నుంచి 50 శాతం వరకు పెరిగింది. అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల విలువను ప్రాంతాల వారీగా 20 నుంచి 50 శాతం వరకు అధికారులు పెంచారు. కొన్ని ప్రాంతాల్లో ఇది 80 శాతంగా ఉంది. పురపాలక సంఘాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సగటున పెరుగుదల 33 శాతంగా ఉంది. గ్రేటర్ పరిధిలో అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల విలువ 20 శాతం నుంచి గరిష్ఠంగా 50 శాతం వరకు పెరిగింది. కొన్ని మండల కేంద్రాల్లోనూ ఇది 50 శాతంగా ఉంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ పెంపు ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలిస్తోంది.
ప్రాంతాల వారీగా పెంపు
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువ పెంపునకు వివిధ అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలిసింది. మండల కేంద్రాలు, అనుసంధానత.. ఆ ప్రాంతంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త విలువలను నిర్ధారించినట్లు సమాచారం. మండల కేంద్రమైన బంట్వారంలో ఇళ్ల స్థలాల భూమి చదరపు గజం విలువ రూ.300 ఉండగా తాజాగా దీన్ని 500 రూపాయలకు పెంచారు. ఇళ్లకు సంబంధించి చదరపు అడుగు రూ.900 ఉండగా దీన్ని రూ.1200గా నిర్ణయించారు. పరిగి పురపాలక సంఘంలో గతంలో గరిష్ఠ చదరపు గజం భూమి విలువ రూ.7000 కాగా దీన్ని రూ.9250గా పెంచారు. తాండూరులో రూ.7000 నుంచి రూ.9250కి పెరిగింది. రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు అత్యధిక రాబడిని తెచ్చే రంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాంతాల వారీగా వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుర్కయాంజల్‌లో చదరపు గజం గతంలో రూ.5000 ఉండగా రూ.7500కు పెంచారు.
స్టాంపు డ్యూటీ 5 శాతానికి!
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రసుత్తం ఆరు శాతంగా ఉన్నాయి. ఇందులో స్టాంపు డ్యూటీ 4 శాతం కాగా ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 1 శాతంగా రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతంగా ఉంది. తాజాగా స్టాంపు డ్యూటీని 5 శాతానికి పెంచేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7 శాతానికి పెరుగుతాయి. ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆ శాఖ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు.
సంబంధిత కథనం: LAND VALUE INCREASE: రిజిస్ట్రేషన్ రుసుం పెంపుతో రాష్ట్ర ఖజానాకు భారీ రాబడి