The Culinary Lounge in Hyderabad : వినియోగదారుల్ని మెప్పించాలంటే.. మెనూలోని వంటకాలు రుచిగా ఉంటే మాత్రమే చాలదు. దాన్ని ఆస్వాదించే వాతావరణం, వైవిధ్యమైన ఆకర్షణలు కూడా ఉండాలి. వీటితో పాటు ఆహార ప్రియుల్ని మెప్పించేలా కస్టమైజేషన్ చేయడమే మా ప్రత్యేకత అంటున్నారు ‘ది కలినరీ లాంజ్’ నిర్వాహకుడు గోపీ కిశోర్ బైలుప్పుల. దీన్ని 2018లో ఏర్పాటు చేశారు. కార్పొరేట్, బిజినెస్ సమావేశాలూ, వ్యక్తిగత, కుటుంబ వేడుకలూ.. ఏవైనా ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకోవచ్చు. అంతా కలిసి నచ్చినవి వండి వడ్డించుకోవచ్చు. ఖండాంతర రుచులు మొదలుకుని స్థానిక వంటకాల వరకూ ఏవైనా కోరుకోవచ్చు. ఇక్కడ ఏ ఒకరో ఇద్దరో మాత్రమే షెఫ్‌లు ఉంటారనుకుంటే పొరపాటు. ప్రపంచ వ్యాప్తంగా 500కుపైగా షెఫ్‌లతో ఒప్పందం చేసుకుందీ సంస్థ. వారిలో జాతీయ, అంతర్జాతీయ స్టార్‌షెఫ్‌లు గరిమా అరోరా, మిషెల్లిన్, జాన్సన్, మందర్ వంటి వారెందరో ఉన్నారు. వారినే ఇక్కడకు రప్పించుకునీ వండించుకోవచ్చు కూడా.
బడ్జెట్ చెబితే చాలు..
The Culinary Lounge : వైవిధ్యాన్ని కోరుకునే అతిథుల బడ్జెట్ ఆధారంగా కస్టమైజ్డ్, లగ్జరీ, ప్రీమియర్ ఏర్పాట్లు చేస్తారు. అవసరమైతే గంటల చొప్పున ఆ ప్రదేశాన్నీ అద్దెకు తీసుకోవచ్చు. కొవిడ్ తర్వాత ప్రైవేట్ డైనింగ్‌కి ఆదరణ పెరగడంతో రాజకీయనాయకులూ, సినీతారలూ, వ్యాపార వేత్తలెందరో ఈ సంస్థకు ఖాతాదారులుగా మారారు. ఇందుకోసం ప్రత్యేకంగా కాంట్రాక్ట్‌లూ చేసుకుంటున్నారు. కార్పొరేట్ సమావేశాల కోసం సంస్థ సుమారు వందకు పైగా థీమ్‌లను సిద్ధం చేసింది. డెలాయిట్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీలకు చెందిన టాప్ సీఎక్స్‌వోల సమావేశానికీ, సింగపూర్‌కి చెందిన గూగుల్ గ్లోబల్ టీమ్‌కూ, ఈవో గ్రూప్- సీఈవో క్లబ్ వంటివి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలకూ ఆతిథ్యం ఇచ్చింది.
పిల్లలకోసం ప్రత్యేకంగా..
The Culinary Lounge Restaurant : షెఫ్‌ల ఆధ్వర్యంలో ఇంటిల్లిపాదీ వంటల తయారీలో పాలు పంచుకుంటూ...రుచులను ఆస్వాదించే భిన్నమైన అనుభూతి పిల్లలను మెప్పిస్తుంది. అందుకే చిన్నారులకోసం కుకింగ్, బేకింగ్ క్లాసులూ నిర్వహిస్తోందీ కలినరీ లాంజ్. ఇలా ఐదు వేలమంది చిన్నారులకు పాకశాస్త్ర పాఠాలు చెప్పారు షెఫ్‌లు. విభిన్న వంటకాల తయారీ వర్క్ షాప్‌లెన్నో నిర్వహించారు. స్టార్ హోటళ్లతో ఒప్పందం చేసుకుని యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాల్నీ కల్పిస్తోందీ సంస్థ. ఇక, కొవిడ్ తర్వాత ఇంటికే పరిమితమైన చిన్నారుల కోసం ప్రత్యేకంగా డీఐవై కిట్లూ రూపొందించి ‘ఆరెంజ్ ఫిగ్’ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చారు. చందా విధానంలో నెలకు నాలుగు రకాల కిట్లు ఇంటికే వచ్చేలా డిజైన్ చేశారు. అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్, బిగ్‌బాస్కెట్ వంటి ఈ కామర్స్ సైట్లలోనూ అందుబాటులో ఉన్న వీటిని తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబయి, దిల్లీ, దుబాయ్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి చోట్లకూ పంపిస్తున్నారు. అలానే కొత్తగా హోటల్ రంగంలోకి రావాలనుకునేవారికి డిజైనింగ్, మెనూలాంటివీ తయారు చేసి ఇస్తారు.
ఈ ఆలోచనకు పునాది..
The Culinary Lounge Restaurant in Hyderabad : గోపీ కిశోర్‌ది కాకినాడ. షెఫ్ కావాలనుకున్న అతడు కొన్ని పరిస్థితుల వల్ల ఇంజినీర్ అయ్యాడు. పదేళ్ల పాటు కార్పొరేట్ కొలువు చేసినా సంతృప్తి ఇవ్వకపోవడంతో దాన్ని వదిలేశాడు. 2014లో మొదట పర్యటకులకు ఇంటి భోజనం అందించేలా ‘ఫీస్ట్’ పేరుతో స్టార్టప్‌ని ప్రారంభించాడు. డిన్నర్ టేబుల్ టికెట్స్ విధానంలో ఓ వంద కార్యక్రమాలు చేశాక.. దానికి కొనసాగింపుగా ఈ కలినరీ లాంజ్ ఆలోచన పుట్టుకొచ్చింది. ప్రస్తుతం యాభై మందికి ఉపాధి కల్పిస్తోందీ సంస్థ.