కరోనా ప్రభావం మిఠాయి దుకాణాలపై పడింది. కొవిడ్ ముందుతో పోలిస్తే 30 శాతమే వ్యాపారమే జరుగుతోందని.. ఉద్యోగుల జీతాలు, అద్దె ఖర్చులు వస్తే చాలన్నట్లుగా చాలామంది వ్యాపారం సాగిస్తున్నారు. కొందరు దుకాణాలు మూసేయగా... మరికొందరు బ్రెడ్డు, పావుబాజీ తయారీ బాట పట్టారు. పేరున్న పెద్ద దుకాణదారులు అన్ని జాగ్రత్తలతో తక్కువ మంది సిబ్బందితో నెట్టుకొస్తున్నారు.
ప్రతి వ్యాపారానికి సీజన్ ఉన్నట్లే.. రాబోయేది మిఠాయిల సీజన్. రక్షాబంధన్‌తో మొదలై వినాయకచవితి, దీపావళి వరకు పండగల సమయంలో నగరవాసులు మిఠాయిలు ఎక్కువగా కొంటారు. కార్పొరేట్ సంస్థలు సైతం దసరా, దీపావళికి తమ ఉద్యోగులు, క్లయింట్లకు స్వీటు ప్యాకెట్లను అందజేస్తుంటాయి. ప్రస్తుతానికి ఈ సీజన్‌పైనే దుకాణదారులు ఆశలు పెట్టుకున్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ సీజన్‌పైనా వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. రిటైల్‌గానూ వ్యాపారం పెద్దగా సాగడం లేదు. జనం బయట కొనడం తగ్గించేశారు. ఏదైనా ఇళ్లలోనే చేసుకొని తింటున్నారు. ప్రస్తుతం సగం వ్యాపారం సాగడం లేదని వ్యాపారస్థులు అంటున్నారు.
ఆన్‌లైన్ ఆర్డర్లు..
మిఠాయి రంగంలో ఉన్న బడా సంస్థలు కొనుగోలుదారుల్లో విశ్వాసం పెంచేందుకు పలు చర్యలు చేపట్టాయి. ప్రత్యేకంగా యాప్‌లను సిద్ధం చేశాయి. అందులో ఆర్డర్ ఇస్తే.. వారు దుకాణానికి వచ్చి వాహనం దిగేలోపే మిఠాయి ప్యాకెట్‌ను చేతిలో పెడుతున్నాయి. కార్ఖానాలు, దుకాణాల్లో పనిచేసే సిబ్బందికి రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. వారికి నిత్యావసరాలు, వైద్య సాయం అందజేస్తున్నారు. వారి నుంచి కొనుగోలుదారులకు ఎలాంటి ముప్పుల్లేకుండా కొన్ని సంస్థలు చర్యలు చేపట్టాయి. మొబైల్ మిఠాయిల వాహనాలు మొదలయ్యాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో సంచరిస్తున్నాయి.
90 శాతం కార్మికులు వెళ్లిపోయారు
లాక్‌డౌన్ పొడిగించుకుంటూ వెళ్లడంతో మిఠాయి కార్ఖానాల్లో పనిచేసే కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. పశ్చిమబంగ, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల వారు ఎక్కువగా వీటిల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం 10 శాతం మందే ఉన్నారు. వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా... తీసుకునే పరిస్థితుల్లో యజమానులు లేరు. బేరాలు లేకపోవడం.. పండగల గిరాకీపై అనిశ్చితి నెలకొనడంతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. చిన్న వ్యాపారులైతే చితికిపోయారు.
రూ.3 వేల కోట్ల వ్యాపారమిది
నగరంలో వార్షిక రిటైల్ మిఠాయి వ్యాపారం రూ.3 వేల కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం భారీగా నష్టపోయింది. గిఫ్ట్ ప్యాక్‌లు, కార్పొరేట్ ఆర్డర్లు లేవు. మున్ముందు ఎలా ఉంటుందో చెప్పలేకున్నాం. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెరిగాయి. ఇంట్లో తయారు చేసుకునే రెడీ టు కుక్ మిఠాయిలు వాడకం పెరిగింది. కావాల్సినప్పుడు ఇంట్లోనే కాజూ బర్ఫీ, మోతీచూర్ లడ్డూ చేసుకునే వీలు ఉండటం.. వేడివేడిగా తినే సౌలభ్యంతో వీటివైపు చూస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు, అద్దెలు, కరెంట్, రవాణా ఖర్చులు మీదపడకుండా వెళ్లదీస్తే చాలన్నట్లుగా వ్యాపారం నడుస్తోంది.
- చైతన్య ముప్పాల, డైరెక్టర్, ఆల్మండ్ హౌస్