TSPSC Group 1: రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు శనివారంతో ముగియనుంది. మొత్తం 503 ఉద్యోగాల కోసం ఇప్పటి వరకు 3,63,974 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ప్రకటించిన గడువు (మే 31) నాటికి 3,48,095 దరఖాస్తులు వచ్చాయి. చివరి నిమిషంలో ఎక్కువ మంది దరఖాస్తు చేయడం, ఆన్‌లైన్లో ఫీజుల చెల్లింపులో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో టీఎస్‌పీఎస్సీ దరఖాస్తు గడువును ఈ నెల 4 వరకు పొడిగించింది. గడువు పొడిగింపు తరువాత ఇప్పటి వరకు కొత్తగా 15,879 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువు దగ్గరపడటంతో అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుకు పోటెత్తారు. సర్వర్‌పై ఒత్తిడి పెరగకుండా, అభ్యర్థులకు సాంకేతిక ఇబ్బందులు రాకుండా కమిషన్, సీజీజీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల చివరి వారం లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, ఈ మేరకు ప్రాథమికంగా టీఎస్‌పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు మరింత సమయం కావాలని నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నుంచి కమిషన్‌కు అభ్యర్థనలు వస్తున్నాయి. గ్రూప్-1 ప్రకటన సుదీర్ఘకాలం తరువాత వెలువడిందని, సన్నద్ధమయ్యేందుకు అవకాశమివ్వాలని కోరారు.
మరోవైపు ఇప్పటికీ గ్రూప్-1 మెటీరియల్ మార్కెట్‌లో సిద్ధంగా లేదు. తెలుగు అకాడమీలోనూ కొరత ఉంది. అభ్యర్థులు గ్రూప్-1కు సన్నద్ధం అయ్యేందుకు కనీసం మూడు నెలల సమయం కావాలని కోరుతున్నారు. జులైలో బ్యాంకు, ఎస్‌ఎస్‌సీ, రైల్వే, ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయి. ఆగస్టులో ఇప్పటికే పోలీసు నియామక మండలి ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష షెడ్యూలు ప్రకటించింది. ఈ పోస్టులకు సన్నద్ధమయ్యే అభ్యర్థులే గ్రూప్-1కు పోటీపడుతారు. మరోవైపు సెప్టెంబరులో సివిల్స్ ప్రధాన పరీక్ష షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. ప్రిలిమినరీ పరీక్ష గడువు విజ్ఞప్తులను టీఎస్‌పీఎస్సీ పరిశీలిస్తోంది.
ఇవీ చదవండి: 'హోంమంత్రి మనవడి ప్రమేయం ఉందనేది నిరాధారమే.. నిందితుల్లో ప్రముఖ వ్యక్తి కుమారుడు'
అదానీని వెనక్కినెట్టి.. ఆసియా కుబేరుడిగా మళ్లీ అంబానీనే.. మరి ప్రపంచంలో?