TET Notification in Telangana : రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాలు టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టాలా లేదా డీఎస్సీ ద్వారానా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాశాఖలో సుమారు 19వేల ఉద్యోగుల భర్తీ.. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. ఉపాధ్యాయుల పదోన్నతులకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం బోధించేందుకు ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి.. వర్చువల్ వేదికగా ప్రారంభించారు.
రెండ్రోజుల్లో టెట్..
TET Notification 2022 : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ పరీక్ష ఆన్‌లైన్ ఉండదని.. ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
"రానున్న విద్యా సంవత్సరంలో 1 నుంచి 8 తరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రారంభించాలని నిర్ణయించాం. దానికనుగుణంగా ఉపాధ్యాయులను సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా రెండు దశల్లో 9 వారాల శిక్షణ ఇస్తోంది. మొదటి దశలో 363 రాష్ట్రస్థాయి కీ-రిసోర్స్ పర్సన్లకు.. 2,683 మంది జిల్లా మెంటార్స్‌కు శిక్షణ ప్రారంభించాం. ఒక్కో విడతలో 16వేల 500 మంది చొప్పున రాష్ట్రంలో 81వేల 590 మందికి శిక్షణ ఇస్తున్నాం. మొదటి వారం ప్రత్యక్షంగా.. తర్వాత మూడు వారాలు ఆన్‌లైన్‌లో శిక్షణ ఉంటుంది."
- సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి