Tension at MJ Market: అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ ఎంజే మార్కెట్ వద్ద గణేశ్ నిమజ్జనం వేదికపై హిమంత బిశ్వశర్మ ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా... గోషామహాల్ తెరాస కార్యకర్త మైక్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తెరాస కార్యకర్తను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నాయకులు కిందకి లాక్కెళ్లారు.
అక్కడున్న తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులో పెట్టేందుకు తెరాస కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. తెరాస నాయకుడు నందకిషోర్ అరెస్ట్ చేయడం పట్ల ఎంజే మార్కెట్ వద్ద తెరాస కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భాజపా, తెరాస శ్రేణులు పరస్పరం నినాదాలు చేశారు. అనంతరం హిమంత బిశ్వశర్మ ప్రసంగించారు.
తెలంగాణలో ఒక్క కుటుంబానికే మంచి జరుగుతోందని.. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు మంచి జరగాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ చెప్పారు. ప్రభుత్వం అనేది ప్రజలందరి కోసం పనిచేయాలి గానీ, ఒక కుటుంబం కోసం కాదన్నారు. తెలంగాణ రజాకార్ల పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అంతకుముందు హిమంత బిశ్వశర్మ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రసంగించాల్సి ఉన్నప్పటికీ అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.
ఇవీ చదవండి: