Temporary Guest Teachers in KGBVs : ఆ ఉపాధ్యాయినులు రోజూ బడికి వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు. విధులకు హాజరైనట్లు సంతకాలు చేయడానికి మాత్రం వీల్లేదు. వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. నాలుగు నెలల నుంచి జీతాలు కూడా లేవు. ప్రైవేట్ పాఠశాలల్లో కాదు.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పరిస్థితి ఇది. ఏదో ఒక కొలువు దొరికిందని ఆనందపడిన అతిథి ఉపాధ్యాయినులు గొంతెత్తలేని దయనీయ స్థితి.
Temporary Guest Teachers in KGBV Schools : రాష్ట్రవ్యాప్తంగా 475 కేజీబీవీలు ఉన్నాయి. వాటిలో చాలాచోట్ల ఇంటర్‌మీడియట్‌ను ప్రవేశపెట్టడం, గతంలో పనిచేసిన ఉపాధ్యాయినులు మానేయడంతో ఈ విద్యా సంవత్సరం తాత్కాలికంగా అతిథి టీచర్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దాదాపు 940 మందిని గత నవంబరు నుంచి తీసుకున్నారు. వారు రోజూ వచ్చి పాఠాలు చెప్పడం తప్ప రిజిస్టర్‌లో సంతకాలు చేయడానికి వీల్లేదు. కేజీబీవీ ప్రత్యేక అధికారులే (ఎస్‌ఓ) వారు వచ్చిందీ లేనిది చూసి రిజిస్టర్‌లో నమోదు చేసుకుంటారు.
Temporary Guest Lecturers in KGBVs : కాంట్రాక్టు ఉద్యోగులతో సమానంగా జీతం ఇస్తామని నియామకం సందర్భంగా చెప్పారు తప్ప ఉత్తర్వులు లేవు. కాంట్రాక్టు ఉపాధ్యాయుల నియామకం జరగగానే తాము వెళ్లిపోతామని హామీపత్రాన్ని రాయించుకున్నట్లు సమాచారం. మరోవైపు అధికారులు 40 మంది పీఈటీలను తొలగించాలని డీఈఓలకు ఆదేశించారు. కేజీబీవీల్లో అతిథి ఉపాధ్యాయినుల నియామకాలకు ప్రతిపాదనలు పంపినప్పుడు పీఈటీల ప్రస్తావన లేనందున ఆ పోస్టులకు తమ ఆమోదం లేదని ఆర్థికశాఖ తేల్చి చెప్పినట్లు విద్యాశాఖ అధికారి ఒకరు స్పష్టంచేశారు.