'కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ సీఎంలు కూర్చుని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవచ్చు. వారి వల్ల కాకపోతే అపెక్స్ కమిటీ వద్దకు వెళ్లి చర్చించవచ్చు. అలాకాకుండా సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిష్కరించుకునే అవకాశాలున్నా అలా కాకుండా రాజకీయాలు చేస్తున్నారు’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ రాజీనామాతో కొత్త అధ్యక్షుడి నియామకంపై చర్చించేందుకు శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలంగాణ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో తాజా జల వివాదాన్ని నేతలు ప్రస్తావించగా చంద్రబాబు ఇలా స్పందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయండి..
తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి పనులన్నీ తెలుగుదేశం పాలనలో జరిగినవేనని, ఇతర పార్టీలు చేసిందేమీ లేదని ప్రజలకు చెప్పాలని రాష్ట్ర ముఖ్యనేతలకు చంద్రబాబు సూచించారు. ‘‘రమణలాంటి నేతలు ఎందరు పార్టీని వీడినా నష్టమేమీ లేదు. కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దు. ముఖ్యనేతలంతా కలసికట్టుగా ప్రజల్లోకి వెళ్లి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయండి. పార్టీ కమిటీలలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయండి’’ అని చెప్పారు.
రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ
రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలని రాష్ట్ర నేతలను చంద్రబాబు అభిప్రాయాలు అడిగారు. ఎవరిని నియమించినా కలసికట్టుగా పనిచేస్తామని నేతలంతా తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు, మరో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని వారు సూచించారు. చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారు.
పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దూకుడుగా వెళ్లే యువనేతకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందన్నారు. రావులతో పాటు బక్కని నర్సింలు, కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవిందకుమార్ గౌడ్‌లతో ఆదివారం మరోమారు సమావేశమై రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ల పదవులకు పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షుల నుంచి ఒకరిద్దని ఎంపిక చేయనున్నారని సమాచారం. అశోక్‌గౌడ్, నెల్లూరి దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ జ్యోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి, ఎస్సీ విభాగం అధ్యక్షుడు అశోక్ తదితరుల పేర్లను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు పరిశీలిస్తున్నారు. అధ్యక్ష పదవికి రావుల పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కాదంటే మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు లేదా ఇతర సీనియర్ నేతను ఎవరినైనా ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే నేతను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెదేపా రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రాంమోహన్‌రావు చెప్పారు. రమణ వెంట ఒక్కరు కూడా పార్టీని వీడి వెళ్లలేదన్నారు.
ఇవీచూడండి: కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడుతం: కేటీఆర్