MP Nama in Lok Sabha: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని లోక్‌సభలో తెరాస డిమాండ్ చేసింది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు.. తెలంగాణలో రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు సంబంధించి సమస్య నెలకొందని నామ అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు. ధాన్యం సేకరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించడం లేదని.. కొద్ది రోజుల క్రితమే సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువచ్చినట్లు వివరించారు.
కేంద్రం ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించడం లేదు. కొద్ది రోజుల క్రితమే సమస్యను కేంద్రం దృష్టికి తెచ్చాం. ధాన్యం సేకరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదే. గత ఏడేళ్లలో తెలంగాణలో నీటి వనరులు పెంచాం. ఉచిత విద్యుత్, రైతు బంధు పథకాలు ప్రవేశపెట్టాం. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నాం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తన వైఖరి చెప్పాలి. -నామ నాగేశ్వర రావు, తెరాస లోక్‌సభాపక్ష నేత
MP Nama on paddy procurement: నాలుగు రోజులుగా పార్లమెంట్‌లో తెరాస ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. పంటలకు మద్దతు ధర ప్రకటించడంతో పాటు ధాన్యం సేకరణపై జాతీయ విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
విపక్షాల వాకౌట్
Walkout from Rajya sabha: విపక్షాల నిరసనతో దాదాపు గంట పాటు వాయిదా పడిన రాజ్యసభ.. 12గంటలకు తిరిగి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. 'సభలో ప్రశ్నోత్తరాల సమయం నడుస్తోంది.. చర్చ జరగదు' అని డిప్యూటీ ఛైర్మన్ తేల్చిచెప్పారు. ఫలితంగా విపక్ష నేతలు తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వారితో పాటు తెరాస, ఎన్సీపీ, ఆర్జేడీ, ఐయూఎంఎల్ నేతలు కూడా నిరసనగా సభను వీడారు.
ఇదీ చదవండి: 'యువతకు ఉద్యోగాల్లేవు.. ఇంకెంత కాలం ఓపిగ్గా ఉండాలి?'