All Party Dharna at Indira Park: వానాకాలం ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద అఖిల పక్ష నేతలు రైతు ధర్మాగ్రహ దీక్ష చేస్తున్నారు. దీక్షలో వామపక్షాలు, తెదేపా, తెజస, ఇంటి పార్టీల నాయకులు పాల్గొన్నారు.కేంద్ర సర్కార్.. గతంలో మాదిరి ధాన్యం కొనుగోలు చేయాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈసారి యాసంగి ధాన్యం కూడా కొనాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలని అన్నారు. అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కనీస మద్దతు ధర ఇవ్వాలి..
All Party Dharna at Indira Park : రోజుల తరబడి ధాన్యం కల్లాల్లోనే ఉండడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కూడా గతంలో మాదిరి యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలన్న ఆయన.. పంటకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనాలని కోరారు.
తరుగు పేరుతో దోపిడీ..
"కొనుగోలు కేంద్రంలో విపరీతంగా దోపిడీ జరుగుతోంది. ప్రతి కేంద్రంలో హమాలీ, రవాణా ఖర్చులు రైతే భరిస్తున్నాడు. టార్పాలిన్లు కూడా కర్షకులే తెచ్చుకుంటున్నారు. తెలంగాణలో వరి మాత్రమే ప్రధాన పంటగా మారింది. వరి తప్ప వేరే ఏ పంట పండించలేని పరిస్థితులు ఉన్నాయి. పారా బాయిల్డ్ రైస్ కొనమని చెబుతున్నారు.. ఇలా అయితే.. రాష్ట్రం నుంచి ఒక్క గింజ ధాన్యం కూడా కొనడానికి వీలుండదు."
- కోదండరాం, తెజస అధ్యక్షుడు
రైతుల ఉద్యమంతో నమ్మకమొచ్చింది..
All Party Dharna Over Paddy Procurement : దేశంలో రైతాంగ ఉద్యమం ఒక విశ్వాసం, ఆక్సిజన్ ఇచ్చినట్లైందని ప్రముఖ సామాజిక, ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. రైతులకు సంపూర్ణ మద్దతుగా వ్యవసాయ విధానం సమగ్రంగా మార్చాలని డిమాండ్ చేశారు. రైతు కేంద్రంగా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పాలనా వ్యవస్థ వచ్చే విధంగా పోరాటం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు.
కార్పొరేట్ ప్రయోజనాలే లక్ష్యంగా..
Protest Over Paddy Procurement : కార్పొరేట్ ప్రయోజనాలే ధ్యేయంగా కేంద్ర విధానాలున్నాయని ప్రొఫెసర్ నరసింహారెడ్డి ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు లాభాలు, బ్యాంకు నిల్వలు తప్ప.. అన్నదాత శ్రేయస్సు పట్టదని ధ్వజమెత్తారు. యూరప్, అమెరికా నమూనా భారత్‌లో పనిచేయదని.. అభివృద్ధి దిశ మారాలని సూచించారు. కనీస మద్దతు ధరల చట్టం కార్యరూపం దాల్చే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.
ఈ దీక్షలో తెజస అధినేత ప్రొఫెసర్ కోదండరామ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ నరసింహారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు పోటు రంగారావు, రైతు సంఘాల నేతలు సారంపల్లి మల్లారెడ్డి, పశ్య పద్మ, రైతులు పాల్గొన్నారు.