TRS MPs in Parliament : ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తెరాస ఎంపీలు స్పష్టంచేశారు. పార్లమెంటు సమావేశాల నాలుగో రోజూ ఉభయ సభల్లో తెరాస సభ్యులు ఆందోళన కొనసాగించారు. రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న వైస్ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్‌సింగ్ అభ్యంతరం తెలిపారు. వెల్‌లోకి దూసుకురావడం సరికాదని ఆక్షేపించారు.
Parliament Winter Sessions : ‘‘వెల్‌లోకి రావడం బాధాకరమేనని, ధాన్యం కొనుగోలు సమస్యతో పగిలిన హృదయంతోనే తామొచ్చామని’’ కేశవరావు బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలనే డిమాండ్‌కు సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహించిన ఎంపీలు చివరికి రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు లోక్‌సభలో లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీలు నిరసనలు తెలిపారు. ఫ్లకార్డులు పట్టుకుని వెల్‌లో బైఠాయించారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని, కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని, రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ లోక్‌సభపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి జోక్యం చేసుకున్నారు. సభలోనే ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్..తెరాస సభ్యుల చెప్పేది ఎందుకు వినడం లేదంటూ ప్రశ్నించారు. చౌధురి మాటలకు ఇతర విపక్షాలు మద్దతు తెలపడంతో సభాపతి ఓం బిర్లా నామా నాగేశ్వరరావుకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. నామా మాట్లాడుతూ.. వరి అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
తెరాస సభ్యులు × బండి సంజయ్ వాగ్వాదం
Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లపై నామా మాట్లాడుతున్న సమయంలో సభాపతి మైక్ ఆపారు. దీనిపై తెరాస సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తుండగా, భాజపా ఎంపీ బండి సంజయ్ జోక్యం చేసుకుని వారిపై విమర్శలు చేశారు. ‘‘వానాకాలం పంటను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కొనడం లేదు? యాసంగి పంట కొనమని మీకు ఎవరు చెప్పారు?’’ అంటూ ప్రశ్నించారు. క్యాంటీన్‌లో ఫొటోలు దిగి పార్లమెంట్‌లో నిరసన అంటూ తెరాస సభ్యులు ప్రచారం చేసుకుంటున్నారని నినాదాలు చేశారు. బండి సంజయ్‌కు మిగిలిన భాజపా సభ్యులు తోడవడంతో ఆగ్రహించిన తెరాస ఎంపీలు బండి సంజయ్‌పై ప్రతి విమర్శలు చేశారు. ఈ క్రమంలో పరస్పరం పరుష పదజాలం ఉపయోగించారు. నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ వ్యవహరిస్తున్నా, సభాపతి అదుపుచేయడం లేదంటూ ఆక్షేపించిన తెరాస ఎంపీలు ప్లకార్డులు చించి, విసిరేసి సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, పార్టీ ఎంపీలు సభా పరిణామాలు, తదితర అంశాలపై విలేకరులతో మాట్లాడారు.
రైతుల కోసం సహిస్తున్నాం
MP Keshava Rao : "లోక్‌సభలో మా ఎంపీలను బండి సంజయ్ తదితరులు దూషిస్తున్నా రైతుల కోసం సహిస్తున్నాం. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించేందుకు కనీసం మూడేళ్లు పడుతుంది. అప్పటివరకు బాయిల్డ్ రైస్ కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం."
- కె.కేశవరావు, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత
అనేక ఇబ్బందులు పెడుతున్నారు
MP Nama Nageswara Rao : రాష్ట్రంలో రైస్ మిల్లులకు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికే అనుమతి ఇస్తున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లలో బహుముఖంగా ఇబ్బందిపెడుతోంది. కల్లాల్లో పంట కొంటామని చెబుతున్న సంజయ్ పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలి.
- నామా నాగేశ్వరరావు, తెరాస లోక్‌సభ పక్షనేత
రైతులతో చెలగాటమాడుతున్నారు
బండి సంజయ్ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. భాజపా ఎంపీలు పార్లమెంట్‌ను అగౌరవపర్చేలా మాట్లాడుతున్నారు.
- వెంకటేష్, పెద్దపల్లి ఎంపీ