ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రెండు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానంపై జిల్లా కలెక్టర్లు, జిల్లా, మండల వ్యవసాయాధికారులు, విస్తరణాధికారులు, గణాంక అధికారులు, రైతు బంధు సమితి ప్రతినిధులతో దృశ్యమాధ్యమ సమీక్ష ఒకటి కాగా కరోనాపై ప్రత్యేకంగా ఉన్నతస్థాయి సమీక్ష మరొకటి.
సమగ్ర వ్యవసాయ విధానం రూపకల్పనలో భాగంగా ఇప్పటికే సీఎం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులతో చర్చించాలని నిర్ణయించడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం అన్నిజిల్లాల కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 2 తర్వాత ఈ సమావేశం ప్రారంభమవుతుంది.
కొత్త సమగ్ర వ్యవసాయ విధానం దిశగా ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను సీఎం వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు కరోనా పరిస్థితులను సమీక్షించేందుకు ఈ నెల 15న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా శుక్రవారం ఉదయం సమావేశం జరుగుతుంది.
లాక్‌డౌన్‌కు తెలంగాణలో ఈనెల 29 వరకు గడువు ఉంది. శుక్రవారం నాటి సమీక్షలో తాజా పరిణామాలను పరిశీలించి, దానిని యథాతథంగా అమలు చేసేందుకు మొగ్గు చూపే వీలుంది. వారం రోజులుగా జిల్లాల్లో ఎక్కడా కొత్తగా కరోనా కేసులు నమోదు కానప్పటికీ జీహెచ్‌ఎంసీ పరిధిలో వాటి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కఠినమైన ఆంక్షలను కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరికొన్ని సేవలపైనా చర్చించి వాటిని వెల్లడించే అవకాశాలున్నాయి.