Telangana Withdrawn RTI Circular:ఆర్టీఐ వివాదాస్పద ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సమాచారం ఇచ్చేముందు శాఖాధిపతుల నుంచి ముందస్తు అనుమతి పొందాలంటూ అక్టోబరు 13న సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గతంలోనే విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ధర్మాసనం.. ప్రభుత్వ ఉత్తర్వులపై అసంతృప్తి వ్యక్తం చేసి స్టే విధించింది.
ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా అక్టోబరు 13 నాటి ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. అవసరమైతే శాఖాధిపతుల సహకారం, సలహా తీసుకోవాలని సమాచార శాఖ అధికారులకు తెలపాలంటూ ఇవాళ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఒకేశాఖలోని వివిధ విభాగాలకు సంబంధించిన సమాచారం అడుగుతున్నప్పుడు... సమాచార అధికారులు వాటిని సేకరించలేకపోతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. సమాచారాన్ని సకాలంలో ఇవ్వడంతో పాటు సంపూర్ణంగా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అందుకో శాఖ పరిధిలోని వివిధ విభాగాల నుంచి సమాచారం సేకరించేందుకు.. శాఖాధిపతుల సహకారం తీసుకోవాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త ఉత్తర్వులను కోర్టుకు ఏజీ సమర్పించారు. వివాదస్పద ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నందున... ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ ముగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
ఇదీచూడండి: MOVIE TICKETS: సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో రద్దు చేసిన హైకోర్టు