రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో పన్ను రాబడులు(Telangana Tax revenue) 43 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి. కరోనా ప్రభావం, లాక్‌డౌన్ వంటి పరిస్థితులు కొనసాగినా గత ఆర్థిక సంవత్సరం కంటే రాబడులు గణనీయంగా పెరిగాయి. కేంద్ర పన్నుల వాటా 33 శాతం ఉన్నా ఇతర రాబడులు 40 శాతంకంటే ఎక్కువే ఉన్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రాష్ట్రానికి పన్నుల రాబడి(Telangana Tax revenue) రూ. 45,859 కోట్లు వచ్చింది. వీటిలో అత్యధికంగా జీఎస్టీ రాబడి(GST Revenue) ఉండగా తర్వాత స్థానంలో అమ్మకం పన్ను ఉంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్, పన్నేతర రాబడి మాత్రం అంచనాలకంటే బాగా తక్కువగా ఉంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాలు కాకుండా రెవెన్యూ రాబడి రూ. 1,76,126 కోట్లుగా అంచనా వేయగా ఇప్పటికి రూ. 53,109 కోట్లు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు వరకు రాబడి, వ్యయాలను విశ్లేషించింది. ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీ వరకూ రెవెన్యూ రాబడి అంచనాల్లో 30 శాతం రాగా గత ఏడాది మొదటి ఆరు నెలల్లో 22 శాతమే వచ్చింది. సెప్టెంబరు వరకు రూ. 25,573 కోట్ల రుణాలను తీసుకోగా ఇది అంచనాల్లో 56 శాతంగా ఉంది. ఆరు నెలల్లో రూ. 76,245 కోట్లు వ్యయం కాగా ఇది అంచనాల్లో 38 శాతంగా ఉంది.