ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ను రద్దు చేసి అన్ని రకాల రిజిస్ట్రేషన్‌లు వెంటనే ప్రారంభించాలని తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ చట్టాలను తీసుకువచ్చి మోయలేని భారం మోపి సాధారణ ప్రజల నడ్డి విరిచిందని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ నారగోని ఆరోపించారు. హైదరాబాద్ బీఆర్‌కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోషియేషన్ ప్రతినిధుల బృందం వినతిపత్రం సమర్పించింది.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తుందో... నియంత పాలన నడుస్తుందో అర్థం కావడంలేదని ప్రవీణ్ నారగోని ఆక్షేపించారు. అన్ని రకాల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించకపోతే ఇక ముందు జరగబోయే ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు.